సోమవారం 13 జూలై 2020
Suryapet - Jun 02, 2020 , 00:38:04

పీసీసీ స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాల్సింది..

 పీసీసీ స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాల్సింది..

  • ఉత్తమ్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఉమ్మడిజిల్లా నేతల్లో అంతర్మథనం 

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : తాము పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించుకునేలా ప్రభుత్వం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన గలాట ఆ పార్టీలో విమర్శలకు తావిచ్చింది. స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిందని, ఇటువంటి చర్యలతో ప్రజల్లో పలుచన అవుతామని కొందరు నాయకులు పేర్కొంటున్నారు. ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలతో సదస్సులను అడ్డుకున్నామనే బదనాం మోయాల్సి వస్తుందని కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతులకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న కార్యక్రమాలు చేపడుతుండగా.. అన్నదాతలు, అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు ఏం చెప్పదల్చుకున్నారో తెలియలేదు. కానీ.. అక్కడ జరిగిన ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌ శ్రేణులు డిఫెన్స్‌లో పడినట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆరేండ్ల వ్యవధిలో అనేక పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. సాగునీరు, 24గంటల ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడి, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. అయితే.. తాము పండించిన పంటకు రైతులే ధర నిర్ణయించుకునేలా నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చారు. అందరూ ఒకేపంట వేసి నష్టపోకుండా పంటమార్పిడి చేసేందుకు కార్యాచరణ రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈక్రమంలో ఉమ్మడి జిల్లాలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నియోజకవర్గస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నకిరేకల్‌, మునుగోడు నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తవగా.. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీ హోదాలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొని సృష్టించిన రసాభాస కాంగ్రెస్‌ పార్టీని గందరగోళంలోకి నెట్టేసింది.

పంటలకు గిట్టుబాటు ధరపై మీ పార్టీ వైఖరి వెల్లడించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన డిమాండ్‌.. కాంగ్రెస్‌ను మరింత అగాథంలోకి నెట్టేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీ హామీలు అమలు చేయనప్పుడు, ప్రజా సమస్యలపై నిరసన తెలుపవచ్చు. కానీ.. మెజారిటీ ప్రజలకు లబ్ధి చేకూర్చే వాటిని వ్యతిరేకించడం ద్వారా పార్టీ మరింత బలహీనమవుతుందని కాంగ్రెస్‌శ్రేణులు మదనపడుతున్నాయి. మిషన్‌ భగీరథ, 24గంటల విద్యుత్‌, కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారనే అపవాదు ఇప్పటికే ఉందని, తాజా ఘటనతో మరింత అభాసు పాలయ్యామని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు నల్లగొండకు వచ్చినా ఆపార్టీ నియోజకవర్గ నాయకులు మొహం చాటేయడం గమనార్హం. ఇటీవల విజయం సాధించిన స్థానిక కౌన్సిలర్లు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.


logo