సోమవారం 13 జూలై 2020
Suryapet - Jun 01, 2020 , 01:50:37

పల్లెలు, పట్టణాల్లో నేటి నుంచి పారిశుధ్య నిర్వహణ

పల్లెలు, పట్టణాల్లో నేటి నుంచి పారిశుధ్య నిర్వహణ

  • ఈ నెల 8వరకు కొనసాగనున్న ప్రత్యేక కార్యక్రమం
  • కరోనా వైరస్‌, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తత కోసమే.. 
  • పజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్న యంత్రాంగం

ఒకవైపు కరోనా ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.. మరోవైపు వ్యాధుల కాలం వానకాలం సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో సంపూర్ణ పారిశుధ్యమే మనకు ఆరోగ్య భద్రత.. మనం, మన ఇల్లు, మన ఊరు, మన పట్టణం అన్నీ శుభ్రంగా ఉంటేనే వ్యాధుల నివారణ సాధ్యం..ఈ పరిస్థితుల్లో నేటి నుంచి జూన్‌ 8 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. తొలిరోజు గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు గుర్తించనున్నారు. ఆ తర్వాత వారం రోజుల్లో వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. 

సూర్యాపేట, నమస్తే తెలంగాణ  : వానకాలం సమీపిస్తున్న తరుణంలో అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ప్రతిసారి జూన్‌ నుంచి సీజనల్‌ వ్యాధులను నియంత్రించేందుకు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి కరోనా భయం కూడా ఉండడంతో వీటన్నింటినీ నిరోధించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే పల్లెప్రగతి కార్యక్రమంలో గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లో నిర్వహించిన యంత్రాంగం పారిశుధ్యంపై ప్రధాన దృష్టి సారించింది. తదనంతరం పంచాయతీలో పెండింగ్‌పనులు చేపట్టి క్రమంగా సర్కార్‌ ఇచ్చే నెలనెలా నిధులతో పల్లెలను శుభ్రపరుస్తున్నారు. అయితే నేటినుంచి ప్రత్యేక దృష్టిసారించి అన్నిపల్లెలను పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దనున్నారు. సాధారణంగా వానకాలంలో వర్షాలు వచ్చినప్పుడు గ్రామాల్లో ఉండే పాత బావులు, వీధులు, గుంతలతోపాటు ఇతరత్రా నీటినిల్వల్లో దోమలు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంటాయి. వర్షాలు పడిన వెంటనే వ్యాధులు వ్యాప్తి చెందకుండా మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి నిల్వలు ఉండే ప్రాంతాలను గుర్తిస్తున్నారు.  

క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో నేడు పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాదయాత్ర నిర్వహించి పారిశుధ్యంలో చేయాల్సిన పనులను గుర్తిస్తారు. నీటినిల్వలు, మురుగుగుంతలు, పూడుకుపోయిన డ్రైనేజీలు, వీధుల్లో కంపచెట్లు తదితర వాటి పరిష్కారానికి వారంరోజుల ప్రణాళిక రూపొందించి చర్యలు తీసుకోనున్నారు.

పరిశుభ్రతకే ప్రాధాన్యం

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 8 రోజులపాటు పారిశుధ్యంపై అన్ని గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నాం. పంచాయతీ పాలక వర్గాలతో పాటు అధికారులు, ప్రజలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. దోమలు, ఈగలు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా స్ప్రేయర్లు, పిచికారీ మందులు సిద్ధం చేశాం. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటే పల్లెలన్నీ స్వచ్ఛంగా మారుతాయి. 

- యాదయ్య,  జిల్లా పంచాయతీ అధికారి, సూర్యాపేట


logo