శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - May 31, 2020 , 04:38:00

ఈతకు వెళ్లి ఇద్దరు దుర్మరణం

ఈతకు వెళ్లి ఇద్దరు దుర్మరణం

  • మృతులు బావ, బావమరిది 
  • తిమ్మాయిపాలెంలో ఘటన

తిరుమలగిరి(సాగర్‌) : మండల పరిధి తిమ్మాయిపాలెం గ్రామ సమీపంలోని టెయిల్‌పాండ్‌ రివర్స్‌ వాటర్‌లో మునిగి శనివారం బావబామ్మర్దులు మృతిచెందారు. ప్రత్యక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన దేపావత్‌ జానియా శుక్రవారం జాన్‌పహాడ్‌ సైదులు దర్గా పండుగకు బంధువులను ఇంటికి పిలుచుకున్నాడు. బంధువుల్లో ముగ్గురు శనివారం ఉదయం ఈత కొట్టేందుకు గ్రామసమీపంలోని టెయిల్‌పాండ్‌ రివర్స్‌ వాటర్‌లోకి దిగారు. వీరిలో జానియా సడ్డకుడి కొడుకు రమావత్‌ రంగేశ్‌(19), అల్లుడు వాంకుడోతు శ్రీను(32) మృతిచెందగా రమావత్‌ వెంకటేశ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. మొదటగా ఈత కొట్టేందుకు నీళ్లలోకి వెంకటేశ్‌ దిగగా, అనంతరం రంగేశ్‌ దిగాడు. వీరిలో రంగేశ్‌కు ఈత రాక మునిగిపోతుండడంతో కాపాడేందుకు అతని బావ శ్రీను నీళ్లలో దూకాడు.

శ్రీనుకు సైతం ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటమునిగి మృతిచెందారు. వెంకటేశ్‌ మాత్రం ఈదుకుంటూ బయటపడ్డాడు. నీట మునుగుతున్న వీరిని జాలకోటితండాకు చెందిన జయిలాల్‌, చందు, కృష్ణలు వారిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే రంగేశ్‌, శ్రీను మృతిచెందారు. మృతులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వారు. రంగేశ్‌ బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శ్రీను ఒంగోల్‌లోని ప్రైవేట్‌ హోటల్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనుకు భార్య, ఆరునెలల పాప ఉంది. బావబామ్మర్దుల మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలంలో శ్రీను భార్య పాపతో రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించి, బంధువులకు అప్పగించారు. 

సరిహద్దు సమస్య..

ఘటన విషయం తెలుసుకున్నాక తిరుమలగిరి, అడవిదేవులపల్లి ఎస్‌ఐలు ఇద్దరు వచ్చినప్పటికి సరిహద్దు సమస్యతో ఎవరూ కేసు నమోదు చేయాలో తెలియక తర్జనభర్జన పడ్డారు. మృతుల బంధువులు వేడుకోవడంతో ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించడంతో అడవిదేవులపల్లి ఎస్‌ఐ నాగుల్‌మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితుడ్ని కాపాడలేకపోయా..

వాంకుడోతు శ్రీను పొట్టిశ్రీరాములు ఆంధ్రావర్సిటీలో ఎంఫిల్‌ చేస్తున్నప్పుడు నా సీనియర్‌. మేమిద్దరం ఒకే రూంలో ఉండేవాళ్లం. శ్రీను బంధువుల ఇంటికి వచ్చిన విషయం నాకు తెలియదు. తిమ్మాయిపాలెం బ్రిడ్జి వద్ద కేకలు విని రంగేశ్‌, శ్రీనును బయటికి తీశాను. అప్పటికే నా మిత్రుడు శ్రీను, అతని బామర్ది రంగేశ్‌ మృతిచెందారు. నా స్నేహితుడ్ని కాపాడలేకపోయా.

- మేడావత్‌ జయిలాల్‌, 

జాలకోటితండా, అడవిదేవులపల్లి


logo