శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - May 29, 2020 , 01:24:16

అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు

అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు

  • సీఎం కేసీఆర్‌ సంకల్పం మేరకే ఇండ్ల నిర్మాణాలు
  • లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత
  • రోల్‌ మోడల్‌గా డబుల్‌ బెడ్రూం ఇండ్ల కాలనీలు
  • విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  • చివ్వెంల మండలం జి.తిరుమల గిరిలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల ప్రారంభం
  • ఏక కాలంలో 80మంది లబ్ధిదారుల గృహ ప్రవేశాలు

 పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిరుమలగిరిలో రూ.5.8కోట్లతో నిర్మించిన 80 డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించి, వారికి ఇండ్ల పట్టాలు అందించారు. 

చివ్వెంల : గూడులేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, అందుకోసం డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిరుమలగిరిలో రూ 5.8కోట్లతో నిర్మించిన 80 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఏక కాలంలో లబ్ధిదారులందరితో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విధిగా అమలు పర్చేందుకు అడుగులు పడుతున్నాయని, సీఎం కేసీఆర్‌ సంకల్పం మేరకే ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. 2012 సంవత్సరంలో తాను కోదాడ వెళ్తుండగా జి.తిరుమలగిరిలో రేకుల ఇంట్లో మోతె హనుమంతు, అతని కుమారుడు ఒకే గదిలో నివసించడం, వంట సామగ్రి, పత్తి బస్తాలు వేసుకొని ఉండడం చూశానని, 8 సంవత్సరాల క్రితమే ఇక్కడ రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఏకకాలంలో 80మంది గృహ ప్రవేశాలు చేసుకోవడం పట్ల మంత్రి           ఆనందం వ్యక్తం చేశారు. రెండు పడకల ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ లేదని, అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం రోల్‌ మోడల్‌గా ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

డబుల్‌ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు విధిగా మొక్కలు పెంచి రహదారి గుండా వెళ్లే వారిని ఆకర్షించేలా చేయాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా అన్ని రంగాల వారి సంక్షేమానికి ఆయన పాటుపడుతున్నారని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టించి ఇవ్వాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం గ్రామ శివారులో నిర్మించిన డంపింగ్‌ యార్డు, సీసీ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, ఎంపీపీ ధరావత్‌ కుమారిబాబునాయక్‌, జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్‌, వైస్‌ ఎంపీపీ జీవన్‌రెడ్డి, ఆర్డీఓ మోహన్‌రావు, తాసిల్దార్‌ పి.సైదులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారినేని సుధీర్‌రావు, సర్పంచ్‌ కంచర్ల నిర్మలాగోవిందరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సొంతింటి కలను నెరవేర్చిన దేవుడు సీఎం కేసీఆర్‌ 

మేము 30 ఏళ్లు గా ఇక్కడ జీవిస్తు న్నాం. అప్పట్లో ప్ర భుత్వం నిర్మించి ఇచ్చిన ఇండ్లు చాలా ఇరు కుగా ఉండేవి. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ సార్‌ మా మీద దయ తలచి రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించి ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. మా సొంతింటి కల నెరవేర్చిన దేవుళ్లు సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి. మా జీవితాంతం వారికి రుణపడి ఉంటాం. పది కాలాలపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రాష్ర్టాన్ని పరిపాలించాలి.

- మోతె సైదమ్మ-జానయ్య (లబ్ధిదారు)


logo