బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - May 29, 2020 , 01:18:04

రైతులే ధర నిర్ణయించే రోజు రావాలి

రైతులే ధర నిర్ణయించే రోజు రావాలి

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం అదే.. 
  • దేశంలోనే నియంత్రిత సాగు పద్ధతి వినూత్న ప్రయోగం
  • పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం రావాలి
  • ‘రైతు బంధు’ ఆపే ప్రసక్తే లేదు 
  • రైతులతో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖాముఖి
  • అనిరెడ్డిగూడెంలో ఆసక్తిగా సాగిన రచ్చబండ

‘పంట ధర రైతులే నిర్ణయించే రోజు రావాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష.. దేశ రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నియంత్రిత సాగు పద్ధతి లక్ష్యం కూడా అదే.. రైతులను సంఘటిత పర్చడం ద్వారానే సీఎం సంకల్పం సిద్ధిస్తుంది..’ అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నియంత్రిత సాగుపై అవగాహన కల్పించేందుకు మంత్రి గురువారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం అనిరెడ్డిగూడెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామ నడిబొడ్డున రచ్చబండ వేదికగా వందల మంది రైతులు ఆసక్తిగా పాల్గొనగా.. వారి అభిప్రాయాలను తెలుసుకుని అనుమానాలను మంత్రి స్వయంగా నివృత్తి చేశారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని, నియంత్రిత సాగు విధానం రైతుల పాలిట వరంగా మారబోతున్నదని పేర్కొన్నారు.

పెన్‌పహాడ్‌ : తాము పండించే పంటలకు తామే ధర నిర్ణయించుకునే రోజు రావాలని.. నియంత్రిత సాగు లక్ష్యం అదేనని.. రైతులను సంఘటిత పర్చడం ద్వారానే సీఎం కేసీఆర్‌ సంకల్పం సిద్ధిస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు గురువారం పెన్‌పహాడ్‌ మండలం అనిరెడ్డిగూడెంలో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గ్రామ నడిబొడ్డున ఉన్న రచ్చబండపై జరిగిన కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నియంత్రిత సాగుపై రైతుల నుంచి అభిప్రాయాలను తీసుకుని వారి అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు మూస సాగుకు స్వస్తి పలుకాలని, డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ప్రయోగాత్మకంగా చేస్తున్న నియంత్రిత సాగుకు రైతులంతా సంఘటితం కావాలని కోరారు. అందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, ముఖాముఖి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఆహార ఉత్పత్తులను పండించే శక్తి కేవలం దేశంలో తెలంగాణ నేలలకే ఉందన్నారు. వాణిజ్య పంటలపై ప్రతి రైతు దృష్టి సారించడం ద్వారా ఆర్థికంగా ఎదగొచ్చన్నారు. కాళేశ్వరం జలాలతో పచ్చగా మారిన తెలంగాణలో నియంత్రిత సాగు మరింత అందాన్ని తీసుకొస్తుందన్నారు. ప్రస్తుతం ఏ పల్లెకు వెళ్లినా సీఎం కేసీఆర్‌ చెప్పిన పంటలే సాగు చేస్తామని రైతులు ప్రతిజ్ఞ చేయడం సంతోషకరమన్నారు. ప్రతిజ్ఞలు చేయడం పట్ల రైతులు సంఘటితం అయ్యారన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి నమ్మకం కల్గిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత విధానం రైతుల పాలిట వరంగా మారబోతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

రైతు బంధు ఆపే ప్రసక్తే లేదు..

రైతుబంధు పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు దీనిపై చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. అపోహలను సృష్టించే ప్రతిపక్షాల మాటలు ఎవరూ నమ్మడం లేదన్నారు. రైతులు వేసిన పంట వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు విధిగా నమోదు చేయాలని, లేకుంటే చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, పురపాలక వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌, ఆర్డీఓ మోహన్‌రావు, తాసిల్దార్‌ వెంకన్న, వైస్‌ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు పొదిల నాగార్జున, తూముల ఇంద్రసేనారావు, పీఏసీఎస్‌ చైర్మన్లు నాతాల జానకిరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, అనిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ బొల్లక సైదమ్మ, ఎంపీటీసీ నాగు, బొల్లక బొబ్బయ్య, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బండి రామకృష్ణారెడ్డి, వావిళ్ల రమేశ్‌, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, మామిడి అంజయ్య, గడ్డం జగన్‌మోహన్‌రెడ్డి, ముదిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రవీందర్‌నాయక్‌, రైతుబంధు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్‌ మాటే.. మా మాట 

గతంలో లేవిడి నీళ్లతో ఇష్టం వచ్చినట్లు కొద్దో గొప్పో వ్యవసాయం చేసినం. పండించిన పంట చేతికి వస్తే అడ్డికి పావుశేరు అమ్ముకున్నం. ఇప్పుడు నీళ్లకు కొదవ లేదు. చెరువులు నిండినయ్‌. మా భూముల్లో వరి గానీ కూరగాయలు గానీ పండిస్తాం. మాకు మద్దతు ధర ఇస్తామని ధైర్యం ఇస్తే చాలు. కేసీఆర్‌ సార్‌ ఏ పంటలు వేయమంటే గవే వేస్తాం. 

-బొల్లక బొబ్బయ్య  (రైతు, మాచారం-పెన్‌పహాడ్‌)


logo