శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - May 28, 2020 , 06:58:20

యువత ‘ఉపాధి’బాట

యువత ‘ఉపాధి’బాట

నడిగూడెం : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రైవేటు సెక్టార్‌లో యువతకు ఉద్యోగావకాశాలు తగ్గడం.. కులవృత్తులు అంతగా సాగకపోవడంతో యువత ‘ఉపాధి’బాట పట్టింది. ఇన్ని రోజులు పట్టణాల్లో ఏదోఒక పనిచేసి నెలకు ఎంతో కొంత సంపాదించి తమ కుటుంబానికి ఆసరాగా ఉన్న వారు.. లాక్‌డౌన్‌ వల్ల పల్లెబాటపట్టారు. ఇంట్లో ఖాళీగా కూర్చొని, కుటుంబ సభ్యులకు భారం కావడం కంటే గ్రామాల్లో సాగుతున్న ఉపాధి పనులను ఎంచుకొని అంతో ఇంతో సంపాదించాలని నిర్ణయించుకున్నారు. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ పథకం కింద ప్రతి రోజూ పని చేస్తూ కుటుంబాలను పోషిస్తుండగా.. తాము కూడా వారి వెంట పనికి వెళ్తున్నారు. 

30శాతం మంది యువకులే

కోదాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సాగుతున్న ఉపాధిహామీ పనుల్లో అధిక శాతం మంది యువత భాగస్వాములవుతున్నారు. తమ పిల్లలు శ్రమ శక్తిని నమ్ముకొని కూలి పనులు చేస్తుండటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. నియోజకవర్గంలో జరుగుతున్న ఉపాధిహామీ పనుల్లో 30 నుంచి 40 శాతం మంది యువకులే ఉండడం అధికార వర్గాలకే విస్మయం కల్గిస్తోంది. కూలి ఎంత లభిస్తుందనే విషయాన్ని యువత పరిగణలోకి తీసుకోకుండా పనులను చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కోదాడ నియోజకవర్గంలోని ఆయకట్టు మండలాలైన అనంతగిరి, చిలుకూరు, కోదాడ, మోతె, మునగాల, నడిగూడెంతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో సైతం వ్యవసాయ పనులు చేసేందుకు ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో 73,841 మంది కూలీలకు జాబ్‌కార్డు ఉండగా.. అనంతగిరిలో 9396, చిలుకూరు 13278, కోదాడ 11234, మోతె 14697, మునగాల 15452, నడిగూడెంలో 9784 మంది ఉన్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉపాధి పనులు చేస్తుండగా.. కొత్తగా అనంతగిరి మండలంలో 31, చిలుకూరు 34, కోదాడ 49, మోతె 45, మునగాల 14, నడిగూడెం మండలాల్లో 43 మంది యువకులకు జాబ్‌కార్డు అందించి ‘ఉపాధి’ కల్పించినట్లు అధికారులు తెలిపారు.


logo