శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - May 28, 2020 , 06:55:30

షరా మామూలే..!

షరా మామూలే..!

  • సీఎంఆర్‌ సీక్రెట్‌

కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) మిల్లర్ల పంట పండిస్తోంది. గతంలో పలువురు మిల్లర్లు ఎగవేతకు పాల్పడగా.. మరి కొందరు పౌరసరఫరాల శాఖకు రూ.62 కోట్లకు పైనే బాకీ పడ్డారు. కానీ, అధికారులు అవేమీ పట్టించుకోకుండా మరోసారి పెద్దమొత్తంలో ధాన్యం కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది. యాసంగిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో వరి పండగా 169మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. అర్హత లేని, ఎన్‌పీఏ జాబితాలో ఉన్న మిల్లులకు సైతం వడ్లు  అప్పగించడం గమనార్హం. 

 సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం పూర్తి కావడంతోపాటు సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి పెరిగింది. ప్రధానంగా గత వానకాలం, ఇటీవల యాసంగిలో జిల్లా వ్యాప్తంగా భారీగా వరి ధాన్యం పండింది. ఈ యాసంగిలో సూర్యాపేట జిల్లాలో 4.15లక్షల మెట్రిక్‌ టన్నులు, నల్లగొండలో 5.96లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 8లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం సూర్యాపేట జిల్లాలోని 62, నల్లగొండ జిల్లాలోని 107 మిల్లులకు పంపిస్తున్నారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసిన అనంతరం 68శాతం బియ్యాన్ని తిరిగి ప్రభుత్వం సేకరిస్తుంది. గత వానకాలంలో సేకరించిన ధాన్యానికి సంబంధించి మార్చి చివరి నాటికి మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని వంద శాతం సేకరించాల్సి ఉండగా పలు కారణాలతో కేవలం 65శాతం పూర్తయినట్లు తెలుస్తుంది. తక్షణమే 100శాతం పూర్తి చేయాలంటూ ఇటీవలే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని అధికారులు చెబుతున్నారు. గత వానకాలానికి సంబంధించిన సీఎంఆర్‌ ఇప్పటికీ పూర్తి కాలేదంటే మరి ఈ సారి ఎలా ఉంటుందో అనేది ఆందోళనకరంగానే కనిపిస్తోంది. 

అన్నీ అర్హత ఉన్న మిల్లులేనా?

ఈ సారి దాదాపు నాలుగున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్‌ కోసం జిల్లాలోని మిల్లులకు పంపిస్తుండగా అవన్నీ అర్హత ఉన్నవేనా..? అనేది అనుమానంగానే ఉంది. గత ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్‌ అంటే చాలు అటు మిల్లర్లకు, ఇటు అధికారులకు పంట పండేది. ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం తీసుకొని ఎగనామం పెట్టడం ఆనవాయితీగా ఉండేది. చాలా చోట్ల మిల్లర్లపై కేసులు నమోదు చేయడం, రికవరీకి చర్యలు తీసుకోవడం కొనసాగేది. గతంలో ఎగనామం పెట్టిన మిల్లుల నుంచి ఇప్పటికీ జిల్లాలో రూ.కోట్లు రావాల్సి ఉంది. రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం ఆస్తులు జప్తు చేయాల్సి ఉన్నప్పటికీ తూతూ మంత్రంగానే కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సారి గతంలో ఏనాడూ లేని విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిల్లులకు ధాన్యం ఇస్తున్నారు. వీటిలో గతంలో అక్రమాలకు పాల్పడిన మిల్లులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సీఎంఆర్‌ కోసం పీడీఎస్‌ బియ్యం సేకరిస్తుండగా కేసులు నమోదైన మిల్లులతోపాటు రూ.కోట్లు ఎన్‌పీఏలు చేసిన మిల్లులకు కూడా రూ.వంద కోట్లకు పైనే విలువ చేసే ధాన్యం ఇస్తున్నారు. దీంతో ఈ సారి సీఎంఆర్‌ ఎలా ఉంటుంది? ఎన్ని మిల్లులు తమ మాయాజాలం చూపిస్తాయో? గత అనుభవాలను బట్టి అధికారులు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారో చూడాల్సి ఉంది. 

సీఎంఆర్‌ బాకీ రూ.62కోట్లకు పైనే..? 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎంఆర్‌ కింద ధాన్యం తీసుకొని తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ఉన్న మిల్లులు దాదాపు 20వరకు ఉన్నాయి. వీటి నుంచి రావాల్సిన బాకీ సుమారు రూ.62కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తుంది. అధికారుల అవినీతి, పైరవీలు వెరసి అర్హత లేని మిల్లులకు ధాన్యం ఇవ్వడంతో తదనంతరం కొంతమేర బియ్యం ప్రభుత్వానికి ఇచ్చి ఎగనా మం పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీం తో ప్రభుత్వానికి భారీగా నష్టం వస్తోంది. కొద్ది సంవత్సరాలుగా ఈ తంతు యథేచ్ఛగా కొనసాగుతుండగా ఉమ్మడి జిల్లాలో భారీగా బకాయిలు పేరుకుపోయాయి.

పకడ్బందీ చర్యలు  తీసుకుంటున్నాం...

సీఎంఆర్‌ విషయంలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు మిల్లులను తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించేలా ఏర్పాట్లు చేశాము. ఏమాత్రం అనుమానం ఉన్నా మిల్లును వెంటనే సీజ్‌ చేసి ధాన్యం వేరే మిల్లుకు అప్పగిస్తాం. అలాగే ధాన్యం ఇచ్చే మిల్లులకు వేరే ఇద్దరు రైస్‌ మిల్లర్లతోపాటు జిల్లా అసోసియేషన్‌ అంగీకారం కూడా తీసుకుంటున్నాం.

- వేముల పుల్లయ్య, సివిల్‌ సప్లయ్‌  ఇన్‌చార్జి డీఎం, సూర్యాపేట 


logo