శుక్రవారం 10 జూలై 2020
Suryapet - May 27, 2020 , 04:37:42

మిషన్‌భగీరథ పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి

మిషన్‌భగీరథ పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి

  • ఇంటింటికీ నీరందించి సర్కారు లక్ష్యం నెరవేర్చాలి
  • ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష  
  • పాల్గొన్న జడ్పీ చైర్మన్‌ బండా, ఎమ్మెల్యేలు కంచర్ల, నల్లమోతు

నల్లగొండ : మిషన్‌ భగీరథ పెండింగ్‌ పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ అధికారులతో పెండింగ్‌ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు జిల్లా వ్యాప్తంగా భగీరథ పథకం కింద పెండింగ్‌లో ఉన్న గ్రిడ్‌ నుంచి ట్యాంకుల కనెక్షన్లు, ఇంట్రా పనులు , పెండింగ్‌ సమస్యలను నియోజకవర్గాల వారీగా తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో ఈ పథకానికి సంబంధించిన పనులు ఆశించిన స్థాయిలో జరుగడం లేదని ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైతం సభ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పెండింగ్‌ పనులతోపాటు నిర్మాణంలో ఉన్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికీ నిర్దేశించిన విధంగా తాగునీరు అందించాలన్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. అనంతరం జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ, నల్లగొండలో పాదయాత్ర చేసి తాగునీటి సమస్యను గుర్తించారన్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చౌటుప్పల్‌లో భగీరథ పైలాన్‌ వేయించారని తెలిపారు. ఇక్కడి ప్రజలకు తాగునీటి సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో తొలుత పనులు చేపట్టారని, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయించి ఇంటింటికీ తాగునీరు అందించాలన్నారు. నల్లగొండ మండలంలో పైపులైన్ల లీకేజీలు బాగా ఉన్నాయని నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోనూ సమస్యలు ఎక్కువై 4,5 రోజులకోసారి నీరు వస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గంలో ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయకముందే మిగతా పనులు చేశామని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధుల సహకారం ఉంటుందని, ఇంకా జాప్యం చేయకుండా పనులు పూ ర్తి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.  మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ అన్ని గ్రామాలకు తాగునీరు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని, నియోజక వర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ట్యాంకులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, మిషన్‌ భగీరథ ఎస్‌ఈలు లలిత, కృష్ణయ్య, ఈఈలు మోహన్‌రెడ్డి, వంశీకృష పాల్గొన్నారు. 


logo