ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - May 27, 2020 , 04:34:17

పచ్చడి..మరింత ప్రియం

పచ్చడి..మరింత ప్రియం

  •  లాక్‌డౌన్‌తో పెరిగిన ముడి సరుకుల ధరలు
  • మార్కెట్‌లో తగ్గిన పచ్చడి కాయల లభ్యత

బొడ్రాయిబజార్‌ : అన్నంలో ఎంత మంచి కూర ఉన్నా పచ్చడి లేకపోతే వెలితిగా ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న పచ్చడి తయారీ పనులు మేనెల మొదలు జూన్‌ మొదటి వారం వరకు సాగుతుంటాయి. కానీ ఈ సంవత్సరం కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్కెట్‌లోకి పచ్చడి మామిడి కాయలు తక్కువగా రావడంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. దీనికి తోడు ఇందులో ఉపయోగించే ముడి సరుకుల ధరలు కూడా కొండెక్కగా.. ప్రజలకు మామిడి పచ్చడి మరింత ప్రియంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో మామిడి పచ్చడి పెట్టే పనులు సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు పచ్చడి పెట్టగా.. మరి కొందరు ఆ పనిలో ఉన్నారు. రెండు నెలలుగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో సరుకు రవాణా నిలిచిపోయింది. ఫలితంగా పచ్చడి మామిడికాయలు, ముడి సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో ఈ సారి పచ్చడి క్వాంటిటీని కూడా తగ్గిస్తున్నారు. 100 నుంచి 200 కాయలు పెట్టేవారు నేడు 50 నుంచి 100 కాయలతో సరిపెడుతున్నారు. పేదలు మధ్య తరగతి వారైతే 10కాయలతోనే సరిపుచ్చుకుంటున్నారు.

లాక్‌డౌన్‌తో మార్కెట్‌ లేక 

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన రెండు నెలల లాక్‌డౌన్‌లో పచ్చడి మామిడికాయలకు మార్కెట్‌ కరువైంది. దీంతో అవి తోటల్లోనే పండ్లు పండి పనికి రాకుండా పోయాయి. దీనికి తోడు రెండు వారాల ముందు వీచిన ఈదురు గాలులతో తోటల్లో కోత సమయానికి ముందే కాయలు రాలిపోయాయి. దీంతో పచ్చడికి ఎక్కువగా వాడే జలాల్‌, నీలాల్‌ వంటి రకాల మామిడి లభ్యత తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో కాయలు కొద్దిమేర రాగా డిమాండ్‌ అధికంగా ఉండడంతో ధర అమాంతంగా పెరిగి పోయింది. నీలాల్‌ కాయ రూ.20 నుంచి రూ.30, జలాల్‌ రకం రూ.40వరకు ధర పలుకుతోంది. 

పెరిగిన ముడి సరుకుల ధరలు

మామిడి పచ్చడి చేసేందుకు ఉపయోగించే ముడిసరుకుల ధరలు ఆమాంతం పెరిగాయి. ఈ ఏడాది పచ్చడికి ఉపయోగించే మిర్చి, నూనె, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రేట్లు భారీగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొద్దిపాటి కాయల పచ్చడితోనే సర్దుకుంటున్నారు.


logo