శనివారం 11 జూలై 2020
Suryapet - May 25, 2020 , 03:25:31

నియంత్రిత సాగు‘బడి’

నియంత్రిత సాగు‘బడి’

  • పంటల మార్పిడిపై రైతులకు అవగాహన సదస్సులు
  • ఈనెల 27నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల వారీగా నిర్వహణ
  • ఆయా శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
  • ఈ సీజన్‌లో సన్న రకం వరి సాగు పెంచేలా చర్యలు
  • పత్తిలో అంతర పంటగా కంది 
  • సాగుకు ప్రణాళికలు

నల్లగొండ : మూస పద్ధతిలో నడుస్తున్న వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నియంత్రిత సాగు దిశగా రైతాంగాన్ని అవగాహన పరచడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో ఉన్న నేలలను దృష్టిలో పెట్టుకుని వరి, పత్తితోపాటు పప్పు దినుసులను సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా వరిలో సన్నాలపై దృష్టి సారిస్తూ పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయించేలా చర్యలు తీసుకుంటోంది.

ఈ నెల 27 నుంచి అవగాహన సదస్సులు

జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఉన్న గ్రామాల వారీగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నల్లగొండ జిల్లాలోని 242 వ్యవసాయ క్లస్టర్లలో షెడ్యూల్‌ ప్రకారం ఈ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓలు), మండల వ్యవసాయాధికారులు (ఏఓలు), డివిజనల్‌ వ్యవసాయాధికారులు (ఏడీఏలు), సైంటిస్టులు ప్రధాన భాగస్వామ్యం కానున్నారు. వీరితోపాటు వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన ఉద్యాన, మార్కెటింగ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వరిలో 72 శాతం సన్నాలకే ప్రాధాన్యం 

జిల్లాలో ఈ సీజన్‌లో 10,67,318 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో ప్రధానంగా వరి 3,22,562 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గత సంవత్సరం వానకాలం సీజన్‌లో సాగు చేసిన వరిలో 48 శాతం సన్నాలు కాగా 52 శాతం దొడ్డు రకం ఉన్నది. ఈసారి సన్న రకం వరినే 72 శాతం సాగు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక పత్తి సాగు సైతం ఈసారి భారీగానే పెరుగనుంది. జిల్లా వ్యాప్తంగా 7,10,475 ఎకరాల్లో పత్తి సాగు కానుండగా అందులో అంతర పంటగా కంది వేయించేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 30 వేల ఎకరాల్లో కంది సాగు కానుంది. కంది పంటకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులు అంతర పంటగా వేసే అవకాశం ఉంది.

స్థానిక ఉత్పత్తుల్లో సింహభాగం ఎగుమతులు చేసేందుకు చర్యలు

సాధారణ సాగులో 3,22,562 ఎకరాల్లో వరి సాగు చేయనుండగా అందులో 72 శాతం సన్నాలే సాగు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే సుమారు 2.40 లక్షల ఎకరాల్లో సన్నాలే సాగు కానుండగా వీటిని మద్దతు ధరతో కొనుగోలు చేసి స్థానిక అవసరాలు పోను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇక పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరతో సీసీఐల ద్వారా కొనుగోలు చేయనుంది. ఆరు తడి పంటల స్థానంలో పత్తిని ఏఎంఆర్‌పీ, ఎడమ కాల్వ, వరద కాల్వ నీటిని ఉపయోగించుకుని సాగు చేస్తే ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా పత్తిలో అంతర పంటగా కంది సాగు చేస్తే ఆ పంటను సైతం ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయనుందని ఈ సదస్సుల్లో రైతులకు వివరించనున్నారు.

ఈ నెల 27 నుంచి గ్రామ సభలు

వానకాలం సీజన్‌లో సాగు చేసే పంటల విషయమై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 27 నుంచి అన్ని వ్యవసాయ క్లస్టర్లలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ సదస్సులు నిర్వహిస్తాం. వరిలో సన్నాల సాగు పెంపు, పత్తిలో అంతర పంట సాగు, ఇతర పప్పు దినుసుల సాగును పెంచేలా రైతులకు అవగాహన పరుచనున్నాం. 

- శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, నల్లగొండ


logo