బుధవారం 08 జూలై 2020
Suryapet - May 25, 2020 , 03:15:07

ప్రాణం తీసిన ఈత సరదా

  ప్రాణం తీసిన ఈత సరదా


వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి, యువకుడు గల్లంతు

 రైతు సాహసంతో ఒడ్డుకు చేరిన మరో బాలుడు

ఈత సరదా ముగ్గురిని బలిగొన్నది. మరో యువకుడు కాల్వలో గల్లంతుకాగా.. వాగులో మునిగిపోతున్న బాలుడు ఓ రైతు సాహసంతో ప్రాణాలతో బయటపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. 

 తిరుమలగిరి (సాగర్‌) : వాగులో ఈత కొట్టడానికి వెళ్లి ఈత రాకపోవడంతో మునిగి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ధన్‌సింగ్‌తండాలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ధన్‌సింగ్‌తండాకు చెందిన మెగావత్‌ నాగు, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు మెగావత్‌ హరిలాల్‌(6) రెండో తరగతి, తమ్ముడు మెగావత్‌ సాయికుమార్‌ యూకేజీ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. తండా సమీపంలోని వాగులోకి హరిలాల్‌, సాయికుమార్‌, సైదాతో కలిసి ఈతకు వెళ్లారు. వాగులోకి దిగిన అన్నదమ్ములు ఈతరాక మునుగుతుండడం చూసిన గ్రామానికి చెందిన నునావత్‌ లచ్చు వారిని కాపాడాడు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన మిర్యాలగూడ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో హరిలాల్‌ మృతిచెందాడు. సాయికుమార్‌ను మెరుగైన వైద్యం కోసం నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తరలించడంతో ప్రాణపాయస్థితి నుంచి బయటపడ్డాడు. 

శాలిగౌరారం : వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని తిర్మలరాయినిగూడెం పంచాయతీ పరిధిలోని మంగమ్మగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కట్టంగూర్‌ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన నార్ల యాదయ్య భూదాన్‌పోచంపల్లిలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తూ నల్లగొండలో నివాసముంటున్నాడు. శనివారం నకిరేకల్‌ పట్టణం లో జరిగిన కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరై అదేరోజు రాత్రి అత్తగారి ఊరైన మంగమ్మగూడేనికి వచ్చా డు. అతడి చిన్న కుమారుడు ప్రణయ్‌(18) ఆదివారం తన స్నేహితులతో కలిసి శాలిగౌరారం ప్రాజెక్టు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో ఈతకొట్టేందుకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి ఈతకొడుతుండగా ప్రమాదవశాత్తు బావిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే శాలిగౌరారం ఎస్‌ఐ హరిబాబుకు సమాచారం ఇవ్వగా ఆయన ఫైర్‌ సి బ్బంది సాయంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చే పట్టారు. సాయంత్రం బావిలోంచి ప్రణయ్‌ మృతదేహా న్ని బయటకు తీశారు. ప్రణయ్‌ హైదరాబాద్‌లో డిగ్రీ మొ దటి సంవత్సరం చదువుతున్నాడు. ఈమేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మేళ్లచెర్వు : మండలకేంద్రంలోని నాగులచెరువులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వంటమాస్టర్‌ షేక్‌జాని కుమారుడు షేక్‌ హుస్సేన్‌(23) ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి నాగుల చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈక్రమంలో హుస్సేన్‌ ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని మిత్రులు తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు చెరు వు వద్దకు తరలివచ్చి, గజ ఈతగాళ్లతో యువకుడి ఆచూకీ కోసం గాలించగా లభ్యమైన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా హుస్సేన్‌ భార్య మూడు నెలల గర్భిణి. రంజాన్‌ ముందురోజు జరిగిన ఈ ఘటన బంధుమిత్రుల్లో తీవ్రవేదనను మిగిల్చింది.

సాగర్‌ ఎడమ కాల్వలో యువకుడు గల్లంతు 

నిడమనూరు : మండలంలోని ముకుందాపురంలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో ఆదివారం మధ్యాహ్నం యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం దుగ్గెపల్లి గ్రామంలోని ఓ వివాహానికి యువకులు హాజరయ్యారు. 8మంది స్నేహితులు కలిసి మధ్యాహ్నం 2గంటల సమయంలో ఈత కొట్టేందుకు ముకుందాపురం వద్ద సాగర్‌ ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. మాడ్గులపల్లి మండలం కన్నెకల్‌ గ్రామానికి చెందిన తండ నరేశ్‌(26) మరో స్నేహితుడితో కలిసి కాల్వలో దూకాడు. నరేశ్‌ కొంత దూరం ఈదాక ఊపిరి ఆడకపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు ప్రయత్నం చేసినా రక్షించలేకపోయారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ జి.శ్రీనివాస్‌యాదవ్‌ సిబ్బందితో కలిసి కాల్వ వద్దకు చేరుకుని ఘటన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


logo