శుక్రవారం 29 మే 2020
Suryapet - May 24, 2020 , 01:06:02

రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

 లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ ఇబ్బంది పడొద్దు   

 టీఆర్‌ఎస్‌ పాలనలోనే మతసామరస్యం

 విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి    

‘పేట’ నియోజకవర్గంలో సొంత ఖర్చుతో ముస్లింలకు రంజాన్‌ తోఫా అందజేత

సూర్యాపేట టౌన్‌/సూర్యాపేట రూరల్‌ : పవిత్ర రంజాన్‌ను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, లాక్‌డౌన్‌ సమయంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వారికి సహాయ, సహకారాలు అందిస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తన సొంత ఖర్చులతో ‘పేట’ నియోజకవర్గంలోని 5వేల ముస్లిం కుటుంబాలకు మంత్రి రంజాన్‌ తోఫా అందజేసే కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని మసీదు, రాయినిగూడెం వద్ద మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి డ్రై ఫ్రూట్స్‌ సహా 10 రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మతసామరస్యాన్ని కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందె వేసిన చెయ్యి అన్నారు. ఆంగ్లేయుల పాలనలో సైతం అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం సర్వమతాల సమ్మేళనానికి నిదర్శనంగా నిలిచిందని, జాతిపిత మహాత్మా గాంధీ సైతం ఈ విషయాన్ని అంగీకరించారని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు రంజాన్‌ సందర్భంగా పేదలకు ఈ తోఫా అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనా సమయంలో మంత్రి చేస్తున్న సాయానికి ముస్లిం కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో వ్యాపారాలు, ఇతర పనులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో పండుగను ఏ లోటు లేకుండా జరుపుకోవాలని మానవతా దృక్పథంతో అందించిన సాయం మరువలేనిదని ముస్లిం పెద్దలు కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రిని మత పెద్దలు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్య యాదవ్‌, జడ్పీవైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు గండూరి ప్రకాశ్‌, ఆకుల లవకుశ, అభినయ్‌, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo