మంగళవారం 26 మే 2020
Suryapet - May 23, 2020 , 01:36:00

ఇంటి అనుమతి.. ఈజీ

ఇంటి అనుమతి.. ఈజీ

జూన్‌ 2నుంచి ‘టీఎస్‌ బీ-పాస్‌'  

21రోజుల్లో నిర్మాణ అనుమతి  

రూ.1చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ పత్రం జారీ  

75గజాలకు అనుమతి అవసరం లేదు 

సూర్యాపేట సిటీ : ఇంటి నిర్మాణానికి అధికారుల అనుమతి పొందడం ఇక సులువే. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు అమలు చేసిన ‘టీఎస్‌ ఐపాస్‌' విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో ‘టీఎస్‌ బీ పాస్‌' అమలుకు శ్రీకారం చుట్టింది. ఇండ్లు, భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, పనితీరుకు పెద్దపీట వేస్తూ జూన్‌2న ఈ నూతన విధానం ప్రవేశపెట్టనుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద మార్చి నెలలో సూర్యాపేట మున్సిపాలిటీలో టీఎస్‌ బీపాస్‌ అమలు చేసిన ప్రభుత్వం.. జూన్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం కార్యాలయం చుట్టూ తిరుగాల్సిన అవసరం ఉండదు. గృహ నిర్మాణదారుడే ‘ఆన్‌లైన్‌'లో దరఖాస్తు చేసుకుంటే 21రోజుల్లో అనుమతి లభిస్తుంది. స్పందించకపోతే అనుమతి వచ్చినట్టుగానే భావించి పనులు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 

75గజాల్లోపు స్థలానికి రూ.1కే అనుమతి...

మున్సిపాల్టీ పరిధిలో భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతినిచ్చే నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట మున్సిపాల్టీలో మార్చి నెలలోనే శ్రీకారం చుట్టింది. 75గజాల్లోపు నిర్మాణానికి ఆన్‌లైన్‌లో రూ 1చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే వెంటనే అనుమతి పత్రం జారీ చేశారు. అలాగే 200గజాల వరకు(జీ+1) ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన వెంటనే అనుమతి పత్రం పొందవచ్చని తెలిపారు

200గజాలు దాటితే...

200నుంచి 500 చదరపు గజాల్లోపు జీప్లస్‌ 2కంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సింగిల్‌ విండో విధానంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. అనంతరం అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. అలాగే 500 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు 21రోజుల్లో అనుమతి ఇవ్వనున్నారు. ఈ విధానం పూర్తి స్థాయిలో జూన్‌ 2న అమల్లోకి రానుంది. దీంతో మున్సిపాల్టీల పరిధిలో నిర్మాణాలు చేపట్టే వారికి అనుమతులు పొందడం మరింత సులభతరం కానుంది. 

టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీ...

స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతులు జారీ చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నిజనిర్ధారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. అనుమతుల జారీలో ఇబ్బందులు ఎదురైతే బాధితులు టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. అనుమతుల పత్రం జారీ చేయడంలో అధికారులు ఇబ్బంది కలిగిస్తే ఫిర్యాదు చేసేలా టోల్‌ఫ్రీ నెంబర్‌ 22666666 ఏర్పాటు చేసింది. 


logo