శనివారం 06 జూన్ 2020
Suryapet - May 22, 2020 , 00:33:31

తెల్లారిన ‘వలస’ బతుకులు

తెల్లారిన ‘వలస’ బతుకులు

 ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

 ముగ్గురు దుర్మరణం, ఇద్దరికి గాయాలు  l  నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఘటన

చిట్యాల : వేగంగా వస్తున్న కారు రోడ్డుపక్కన ఆగిఉన్న రెండు లారీలను వరుసగా వెనుక నుంచి ఢీకొట్టగా.. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దయ్యాల వీరరాజు హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. స్వగ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో అతని పెద్ద కుమారుడు రాంబాబు కారులో తల్లి లక్ష్మితో కలిసి వెళ్లాడు. బుధవారం రాత్రి 9గంటలకు కారులో తిరిగి హైదరాబాద్‌ వచ్చేటప్పుడు లక్ష్మి తన కూతురి కొడుకు, కుమారుడి కూతురును కూడా వెంట తీసుకొని బయలుదేరింది. హైదరాబాద్‌లోనే వాచ్‌మన్‌గా పని చేస్తున్న అదే గ్రామానికి చెందిన గీసాల శ్రీనివాసు (48) అతడి భార్య లక్ష్మి(40), ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న గొర్రుపూడి గ్రామానికి చెందిన కండవెళ్లి లక్ష్మీచందన(18), ఆమె తమ్ముడు వీరబాబు కూడా అదే కారులో బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులోని రైస్‌మిల్లు వద్దకు చేరింది. మిల్లువద్ద ధాన్యం అన్‌లోడ్‌కోసం వరుసగా లారీలు నిలిపి ఉండగా.. రాంబాబు కారును అతివేగంగా నడుపుతూ రెండు లారీలను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి శ్రీనివాసు అతడి భార్య లక్ష్మి, కండవెళ్లి లక్ష్మీచందన అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ రాంబాబుతోపాటు అతని తల్లి దయ్యాల లక్ష్మికి గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీఐ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. నల్లగొండ డీఎస్‌పీ జి.వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 


logo