శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - May 20, 2020 , 02:22:35

తుది దశకు ‘బస్వాపూర్‌'

తుది దశకు ‘బస్వాపూర్‌'

బస్వాపూర్‌ జలాశయానికి 1.50 టీఎంసీల నీటిని తరలించే లక్ష్యంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. మల్లన్నసాగర్‌ జలాశయం నుంచి 13వ ప్యాకేజీలోని ప్రధాన గ్రావిటీ కాల్వ, సమాంతర కాల్వల ద్వారా దిగువ ప్యాకేజీలకు నీటి సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ప్రధాన గ్రావిటీ కాల్వకు సంబంధించిన ఎడమ కాల్వ ద్వారా నీటిని 15వ ప్యాకేజీ నుంచి 16వ ప్యాకేజీ గల ఆయకట్టుకు, 11.39 టీఎంసీల సామర్థ్యం గల బస్వాపూర్‌ జలాశయానికి గోదావరి నీటిని సరఫరా చేసేలా ప్రతిపాదించారు. అదేవిధంగా కుడి కాల్వ ద్వారా 14వ ప్యాకేజీల ఆయకట్టుకు, 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ జలాశయానికి నీటిని సరఫరా చేయనున్నారు. ఇందుకోసం కొద్దిరోజుల క్రితమే ట్రయల్న్‌ పూర్తి చేశారు. అక్కడి నుంచి నేరుగా 15వ ప్యాకేజీ నుంచి 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న బస్వాపూర్‌ జలాశయానికి నీటిని తరలించనున్నారు.

జూన్‌లోగా 1.50 టీఎంసీల నీరు

వచ్చే వానకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించిన వెంటనే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులు నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నీటిపారుదలశాఖ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. వచ్చే నెల చివరివారంలోగా బస్వాపూర్‌ జలాశయంలో 1.50 టీఎంసీల నీటిని నింపేందుకు కావాల్సిన ప్రధాన కాల్వ పనులు, బస్వాపూర్‌ జలాశయ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 90శాతం ప్రధాన కాల్వ లైనింగ్‌, స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, సొరంగం పనులు పూర్తి కాగా మరో 10శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. 

16 ప్యాకేజీ ఇలా..

 యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో ప్రారంభమై నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం అక్కడి  నుంచి సంస్థాన్‌నారాయణపూర్‌ మండలం వరకు మళ్లించడం కోసం ప్రధాన కాల్వ, ఉపకాల్వ తవ్వించడం ప్రధాన లక్ష్యం. దాదాపుగా  87 కిలోమీటర్లు ప్రధాన కాల్వ ఉంది. ముల్కలపల్లిలో 36.609 కిలోమీటర్ల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ అయిన బస్వాపూర్‌ ప్రాజెక్టు ప్రారంభమవుతున్నది.  అక్కడినుంచి ప్రధాన కాల్వ 5.19 కిలోమీటర్లు ప్రవహించి 41.80 కిలోమీటర్ల వద్ద సుమారు 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమవుతున్న బస్వాపూర్‌ జలాశయంలోకి గోదావరి జలాలు వస్తాయి. 

1,218 చెరువుల్లోకి గోదావరి జలాలు..

బస్వాపూర్‌ జలాశయం నీటిని దిగువకు మళ్లించేందుకు ప్రధాన కాల్వతో పాటు ఆయా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మొత్తం 14 డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఏర్పాటు చేసి యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని మొత్తం 1,218 చెరువులు నింపనున్నారు. 

నల్లగొండ జిల్లాలో 29,169ఎకరాల సాగు

బస్వాపూర్‌ జలాశయం ప్రధాన తూం ద్వారా నిర్మితమవుతున్న దిగువ కాల్వలకు డిస్ట్రిబ్యూటరీ కాల్వను నిర్మించనున్నారు. వీటికి తూంలు నిర్మించి ఉపకాల్వల ద్వారా యాదాద్రి జిల్లాలో 1,218 చెరువులు నింపి 1,59,331 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 29,169 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురానున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,88,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ పనులు ప్రతిపాదించారు.


logo