గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - May 20, 2020 , 02:22:39

అంతటా సందడి..

అంతటా సందడి..

 సూర్యాపేట, నమస్తేతెలంగాణ : కరోనా వైరస్‌ రగిలించిన సంకట స్థితి నుంచి  సాధారణ స్థితికి రావడంతో 58రోజుల అనంతరం ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాలో అన్నీ తెరుచుకున్నాయి. కంటైన్మెంట్లు మినహా మిగిలిన అన్ని జోన్లలో సాధారణ కార్యకలాపాలు జరుపుకోవచ్చని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో మంగళవారం ‘లాక్‌ఓపెన్‌' అయింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడంతోపాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు రోడ్లపైకి వచ్చాయి. వీటితోపాటు దుకాణాలకు సరుకులు తీసుకొచ్చే ట్రాన్స్‌పోర్ట్‌ లారీలు, ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు సూర్యాపేటకు వచ్చి వెళ్లడంతో రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు తెరవలేదని వ్యాపారులు మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, వెంటనే వ్యాపారాలన్నీ సాధారణ స్థితికి రావాలని ఆదేశించడంతో అన్నీ తెరుచుకున్నాయి. మార్చి 22 తరువాత బయటకు వచ్చిన జనం కరోనా కష్టాలను నెమరువేసుకోవడం కనిపించింది 

 సూర్యాపేటలో తొలుత ఒక్క కరోనా కేసు కూడా లేకపోగా, మర్కజ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి మొదటి పాజిటివ్‌ కేసు నమోదై ఆ తరువాత ఒక్కొక్కటిగా పెరుగుతూ ఏకంగా 83 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో  జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించగా సూర్యాపేటతోపాటు పలు గ్రామాల్లో 12 కంటైన్మెంట్‌ జోన్లను ప్రకటించగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేశారు. దీంతో కరోనా వైరస్‌ తిరోగమనంలోకి వెళ్లింది. పదిహేను రోజుల క్రితమే సూర్యాపేట ఆరెంజ్‌ జోన్‌గా మారి ప్రస్తుతం గ్రీన్‌ జోన్‌లోకి రావాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే నిర్ణయం తీసుకోకపోవడం, తదనంతరం ఆయా రాష్ర్టాలకే జోన్ల మార్పిడిని అప్పగించడం జరిగింది. దీంతో సోమవారం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో రాష్ట్రంలో రెడ్‌జోన్లు ఎక్కడా లేవు, అన్నీ గ్రీన్‌ జోన్లే అని ప్రకటించడంతో సూర్యాపేట రిలీఫ్‌ అయింది.  

జనంతో కళకళలాడిన 

 ‘పేట’ వీధులు..

 మంగళవారం జిల్లా కేంద్రంలోని వీధులు జనంతో కళకళలాడాయి. వ్యాపారులు తమ దుకాణాలు తెరచి శుభ్రం చేసుకొని లావాదేవీలు ప్రారంభించారు. ఇన్ని రోజులు ఆటోలు సైతం నడువకపోవడంతో గ్రామాల ప్రజలు సైతం తమ పనుల కోసం పెద్ద ఎత్తున సూర్యాపేటకు వచ్చి వెళ్లారు. ఆటోలు, బస్సులు, ద్విచక్రవాహనాలు రయ్‌ .. రయ్‌మంటూ తిరిగాయి. 


logo