ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - May 10, 2020 , 02:38:49

క్రమంగా యథాస్థితికి..

క్రమంగా యథాస్థితికి..

  • లాక్‌డౌన్‌ సడలింపుతో పట్టణాల్లో సాధారణ  జనజీవనం
  • సరి-బేసి సంఖ్యలో తెరుచుకుంటున్న దుకాణాలు 
  • ప్రజారవాణా మినహా ప్రారంభమైన అన్ని కార్యక్రమాలు 
  • రిజిస్ట్రేషన్లు, రవాణా సహా ప్రభుత్వ పనులన్నీ మొదలు
  • సంతోషం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు, ప్రజలు 

కరోనా కారణంగా ఇన్నాళ్లు కరువైన సందడి క్రమంగా నెలకొంటోంది. ప్రభుత్వాల పిలుపుతో నెలన్నర పాటు ఇంట్లోనే కూర్చున్న జనం.. లాక్‌డౌన్‌ సడలింపుతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. గ్రీన్‌జోన్‌లో ఉన్న యాదాద్రి భువనగిరితోపాటు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న నల్లగొండ జిల్లాలోనూ జన జీవనం దాదాపుగా సాధారణస్థితికి చేరుకుంది. పట్టణాల్లో సరి - బేసి విధానంలో తెరుచుకుంటున్న దుకాణాలు మినహా మిగిలిన పనులన్నీ యథావిధిగా సాగుతున్నాయి. రెడ్‌జోన్‌లో ఉన్న సూర్యాపేట జిల్లాలోనూ వ్యవసాయ, గృహనిర్మాణ రంగాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

- నల్లగొండ, ప్రతినిధి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించిన అనంతరం.. మార్చి 23 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేసిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లాలో 15, సూర్యాపేట జిల్లాలో 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. నల్లగొండలో 15మంది పేషెంట్లు, సూర్యాపేటలో 57మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని యాదాద్రి జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉండగా.. నల్లగొండ ఆరెంజ్‌ జోన్‌, సూర్యాపేట ప్రస్తుతానికి రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 6నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో జన జీవనం క్రమంగా యథాస్థితికి చేరుతోంది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో దాదాపుగా అన్ని కార్యకలాపాలకు అనుమతించిన ప్రభు త్వం.. ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న పట్టణాల్లో మాత్రం సరి - బేసి విధానంలో దుకాణాలు తెరవాలని చెప్పింది. రెడ్‌ జోన్‌లో వ్యవసాయంతోపాటు గృహ నిర్మాణ పనులకు పూర్తిస్థాయిలో వెసులుబాటు కల్పించింది. 

ప్రభుత్వ కార్యకలాపాలు క్రమంగా ముమ్మరం...

వ్యాపారాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఈ నెల 6నుంచి పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సైతం తెరుచుకోవడంతో.. 45రోజులుగా వేచి చూస్తున్న పలువురు భూమి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ క్రమంగా సందడి మొదలైంది. సోమవారం నుంచి జన జీవనం పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఇంటర్‌ పరీక్ష పేపర్ల వాల్యూయేషన్‌ ప్రక్రియ సైతం మొదలైంది. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో నల్లగొండ గ్రీన్‌ జోన్‌లోకి, సూర్యాపేట ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చే అవకాశం ఉండటంతో ప్రజా జీవనం పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి చేరుకోనుంది. 

రెండ్రోజులుగా వ్యాపారం సాగుతోంది...

వేసవిలోనే మా కూలర్ల వ్యాపారం ఎక్కువ సాగుతుంది. ఈసారి కూడా సీజన్‌కు ముందే మొత్తం మెటీరియల్‌ సిద్ధం చేసుకున్నా. తీరా ఎండా కాలం మొదలవుతుండగానే కరోనాతో లాక్‌డౌన్‌ మొదలైంది. ఇన్ని రోజులు దుకాణం తీయలేదు. రూ. లక్షల్లో నష్టపోయాను. ఐదుగురు వర్కర్లు పని చేస్తున్నరు. రెండ్రోజుల నుంచి షాపు తెరుస్తున్న. ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. లాక్‌డౌన్‌ సడలించడం సంతోషంగా ఉంది. కొనుగోళ్ల కోసం వచ్చే వాళ్లు జాగ్రత్తలతో వస్తున్నరు. 

 - ఖలీల్‌, కూలర్ల వ్యాపారి, నల్లగొండ


logo