గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - May 04, 2020 , 02:40:54

నల్లగొండ జిల్లాలో కంటైన్మెంట్‌ జోన్ల ఎత్తివేత

నల్లగొండ జిల్లాలో కంటైన్మెంట్‌ జోన్ల ఎత్తివేత

నల్లగొండ/మిర్యాలగూడ, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్‌ను ఎత్తివేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలోని మీర్‌బాగ్‌కాలనీ, బర్కత్‌పుర, మాన్యంచెల్క-1, మిర్యాలగూడలోని ఈదులగూడ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ ఎత్తవేయగా... మాన్యంచెల్క-2, దామరచర్ల మండల కేంద్రంలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 28రోజులుగా ఈ ప్రాంతాల్లో కొత్త కేసులు లేకపోవడంతో ఎత్తివేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలో 16రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదుకాలేదన్నారు. ఇందుకు సహకరించిన ప్రజందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వైరస్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు. 

కాలనీలను పరిశీలించిన ఎమ్మెల్యేలు..

నల్లగొండలోని మీర్‌బాగ్‌ కాలనీని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ కాలనీని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆదివారం పరిశీలించారు. మీర్‌బాగ్‌ కాలనీ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గుమ్మడికాయతో దిష్టి తీసి బారికేడ్‌ను ఓపెన్‌ చేశారు. ఆయన వెంట ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బుర్రి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు వెంట మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, వైస్‌ చైర్మన్‌ కోటేశ్వర్‌రావు, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేసా రవి, కమిషనర్‌ వెంకన్న ఉన్నారు. 


logo