ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - May 04, 2020 , 02:40:59

ఆపత్కాలంలో రెవెన్యూ ధర్మం..

ఆపత్కాలంలో రెవెన్యూ ధర్మం..

  • కరోనా నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు
  • లాక్‌డౌన్‌ తొలిరోజు నుంచి విధుల్లో యంత్రాంగం
  • గ్రామాల నుంచి సరిహద్దుల వరకు పటిష్ట నిఘా
  • వీఆర్‌ఏలు మొదలుకుని ఆర్డీఓల వరకు అందుబాటులో..

‘ఆరోగ్య సమస్యలు లెక్కచేయకుండా 24గంటలు విధుల్లో ఉంటూ ఉద్యోగ ధర్మం పాటిస్తున్నాం.. కరోనా భయంతో ప్రతిఒక్కరూ ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్న తరుణంలో ప్రభుత్వం అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేరుస్తున్నాం.. కుటుంబసభ్యులు వారిస్తున్నా క్షేత్రస్థాయికి వెళ్లి కరోనాపై యుద్ధం చేస్తున్నాం.. పోలీస్‌, వైద్యశాఖ ఉద్యోగుల స్థాయిలో గుర్తింపు లేకున్నా.. ఆపత్కాలంలో విరామం ఎరుగకుండా పనిచేయడం మాకు చాలా ఆనందాన్నిస్తోంది.’ అని ఓ తాసిల్దార్‌ ‘నమస్తే తెలంగాణ’తో తన 40రోజుల అనుభవాన్ని పంచుకున్నారు.

నల్లగొండ, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు లాక్‌డౌన్‌ విధించిన తొలిరోజు నుంచి రెవెన్యూ యంత్రాం గం నిత్యం విధుల్లో ఉంటోంది. క్షేత్ర సహాయకుడు మొదలు డివిజన్‌ బాధ్యుల వరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగస్వాములు అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 31మండలాల్లోని తాసిల్దార్లతోపాటు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీఓలు, ఆయా కార్యాలయాల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని అవగాహన పరుస్తూ కరపత్రాలను సైతం పంపిణీ చేస్తున్నారు. మండలాల సరిహద్దుల్లో పోలీసులతో కలిసి చెక్‌పోస్టులను పర్యవేక్షిస్తూ జిల్లా సరిహద్దుల్లో క్షేత్ర సహాయకులు 24గంటలు విధుల్లోనే ఉంటున్నారు. 

ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా...

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఇతరప్రాంతాల నుంచి వచ్చేవారిపై వైద్యశాఖ యంత్రాంగం దృష్టి సారిస్తున్నప్పటికీ వారిని గుర్తించడంలో రెవెన్యూ ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల సహకారంతో వారిని గుర్తించి వైద్యపరీక్షలు చేయించడంలో ఈ శాఖ భాగస్వామ్యం అవుతోంది. అంతేగాక కరోనా అనుమానితుల కోసం జిల్లా కేంద్రంలోని ఎంజీయూలో 200పడకల సౌకర్యంతో క్వారంటైన్‌ను ఏర్పాటుచేసి అందులో వసతుల ఏర్పాటుతోపాటు వారికి భోజన, ఇతర సౌకర్యాలను ఏర్పాటుచేసింది. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లో భాగస్వామ్యమై కరోనా పాజిటివ్‌ వ్యక్తులతోపాటు అనుమానితులు, విదేశీయుల పాస్‌పోర్టులు సీజ్‌చేసే బాధ్యతా చేపట్టింది.

వలస కూలీల గుర్తింపులో...

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు 12కిలోల బియ్యంతోపాటు కుటుంబానికి రూ.1500 అందజేస్తుండగా.. అవి ప్రజలకు చేర్చడంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు కీలకమయ్యారు. జిల్లాలో 15వేల మంది వలస కూలీలను గుర్తించి 12కిలోల బియ్యంతోపాటు రూ.500చొప్పున స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేశారు. తొలినెల ఇప్పటికే రేషన్‌కార్డుదారులు, వలస కూలీలకు బియ్యం, నగదు అందగా మే నెలకు సంబంధించి పంపిణీలో నిమగ్నమయ్యారు. మరోవైపు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండప్రాంతాల్లో యాచకులకు రెస్ట్‌హోమ్స్‌ ఏర్పాటుచేసి భోజన సౌకర్యం కల్పించడంతోపాటు ఇతర ఆశ్రమాల్లో వసతి పొందుతున్న వారికి సైతం ఎన్జీఓలు, దాతల సాయంతో కడుపునింపుతున్నారు. 


logo