సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 20, 2020 , 01:36:35

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

  • నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 566 కేంద్రాలు
  • ఇప్పటికే 31.47లక్షల క్వింటాళ్ల సేకరణ
  • ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు ఎగుమతి 
  • 44,473మంది రైతుల ఖాతాల్లోకి రూ.577.61కోట్లు 

నల్లగొండ, నమస్తే తెలంగాణ : యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార యంత్రాంగం ముమ్మరంగా కొనుగోలు చేస్తోంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థల్లోనే రైతులు ఎక్కువ మంది విక్రయించేందుకు రావడంతో కొనుగోళ్లు బాగా పెరిగాయి. ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడంతో రైతులు ఇక్కడే అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. రెండు జిల్లాల్లో 566కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 31.47లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని 44,473మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు రైతులకు రూ.577.61 కోట్లు వెచ్చిస్తుండగా ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సివిల్‌ సప్లయ్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

15 రోజుల్లోనే 31.47లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ-పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. అందులో భాగంగానే నల్లగొండలో 376కేంద్రాలకు 275ప్రారంభించి 31,736మంది రైతుల నుంచి రూ.409.71 కోట్ల విలువైన 22,32,839 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. అదేవిధంగా సూర్యాపేటలో 315కేంద్రాలకు 291 ప్రారంభించి 12,737మంది రైతుల నుంచి రూ.167.90 కోట్ల విలువైన 9,15,150 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మొత్తంగా రెండు జిల్లాల్లో 15రోజుల్లోనే 31,47,989 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటికే 28.58లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేశారు. ప్రధానంగా నల్లగొండలో 22.32లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసి 21.93లక్షల క్వింటాళ్లు మిల్లులకు ఎగుమతి చేశారు. అన్నికేంద్రాలకు గన్నీ బ్యాగులు సకాలంలో అందజేస్తూ, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తుండడంతో కొనుగోళ్లు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.  


logo