శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 07, 2020 , 00:20:01

పోలీస్‌, వైద్య, పారిశుధ్య సిబ్బందికి బత్తాయి పండ్లు అందజేయాలి

పోలీస్‌, వైద్య, పారిశుధ్య సిబ్బందికి బత్తాయి పండ్లు అందజేయాలి

నల్లగొండ, నమస్తేతెలంగాణ : కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిర్విరామంగా సేవలు అందిస్తున్న పోలీస్‌ సిబ్బందితోపాటు వైద్యశాఖ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 5కిలోల బత్తాయిపండ్లను పంపిణీ చేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పలు అంశాలపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వలస కార్మికులకు అందిస్తున్న వసతులను, బత్తాయి, నిమ్మ రవాణాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య, పోలీస్‌, పారిశుధ్య సిబ్బందికి జిల్లాలో రైతులు పండించిన బత్తాయి పండ్లను ఉచితంగా అందించాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇటుకబట్టీలు, కాటన్‌మిల్లులు, రైస్‌మిల్లులు తదితర పరిశ్రమల్లో దాదాపు 17వేల మంది వలస కార్మికులను గుర్తించినట్లు మంత్రికి వివరించారు. వీరికి రూ.500 నగదు, 12కిలోల బియ్యం అందించి 8రిలీఫ్‌ సెంటర్ల ద్వారా వసతి సౌకర్యం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మిర్యాలగూడెం పట్టణంలోని మోడల్‌స్కూల్‌లో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎస్పీ రంగనాథ్‌, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


logo