శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 06, 2020 , 02:11:03

పాజిటివ్‌ కేసులకు జియో ట్యాగింగ్‌

పాజిటివ్‌ కేసులకు జియో ట్యాగింగ్‌

  • మూడు కిలోమీటర్ల పరిధిలో వైరస్‌ సెర్చింగ్‌
  • జిల్లా కేంద్ర దవాఖాన నుంచి 33మంది ఎంజీయూ క్వారంటైన్‌కు తరలింపు
  • క్వారంటైన్‌లో మొత్తం 88మంది 
  • నేడు 30మంది శాంపిల్స్‌ పరీక్షలకు పంపనున్న వైద్యాధికారులు 

నీలగిరి: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు నల్లగొండ జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 14కేసులు నమోదుకావడంతో వారి ఫోన్‌నెంబర్లకు వైద్యాధికారులు జియో ట్యాగింగ్‌ చేశారు. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే సమాచారం అందేలా ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రణాళిక తయారుచేశారు. జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను ఇప్పటికే రెడ్‌ జోన్లుగా ప్రకటించి ఆ ఏరియాల్లో ప్రవేశాలు లేకుండా కంచెలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీంతోపాటు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి సుమారు 3 కి.మీ పరిధిలో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో  ఆ ఏరియాల్లో సెర్చింగ్‌ చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతాల ప్రజలకు పలు సూచనలు జారీ చేస్తూ అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్ర దవాఖానలో 41మంది క్వారంటైన్‌లో ఉండగా 33 మందిని అక్కడ నుంచి ఎంజీయూలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించారు. జిల్లా కేంద్ర దవాఖానలో 8మంది, యూనివర్సిటీలో 80మంది మొత్తం 88 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. దామరచర్లలో నమోదైన కేసుకు సంబంధించి ఏడుగురితో కాంటాక్టు జరిపినట్లు తెలియడంతో వారి శాంపిల్స్‌, జిల్లాకేంద్రంలో మరో 23మంది శాంపిల్స్‌ను అధికారులు సోమవారం పరీక్షల నిమిత్తం పంపించనున్నారు. కరోనా ప్రారంభమైన నాటి నుంచి సర్వేలైన్స్‌ అధికారిగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ రాహుల్‌, అతని అసిస్టెంట్‌ రఫీ కరోనా పాజిటివ్‌ వ్యక్తుల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. రిపోర్ట్స్‌ నెగిటివ్‌ వచ్చినప్పటికీ ఉన్నతాధికారుల సూచనలతో క్వారంటైన్‌లోనే ఉంచుతున్నారు. 


logo