ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 05, 2020 , 03:25:18

పకడ్బందీగా..

పకడ్బందీగా..

  • కోవిడ్‌-19 పాజిటివ్‌ ప్రాంతాల్లో పక్కాగా ‘కార్డన్‌ ఆఫ్‌'
  • రాకపోకలు పూర్తిగా నిషేధం.. ఇండ్లకే నిత్యావసర సరుకులు సరఫరా
  • ప్రతి ఇంచు స్థలంలోనూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌
  • వరుసగా 13వ రోజూ ఇండ్లకే పరిమితమైన ప్రజలు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపడుతోంది. శుక్రవారం వరకు నల్లగొండ జిల్లాలో ఏడు, సూర్యాపేట జిల్లాలో ఒక పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ఇతరులకు సోకకుండా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కార్డన్‌ ఆఫ్‌ విధించారు. నల్లగొండ పట్టణంలో 12 కేసులు, మిర్యాలగూడలో ఒకటి, దామరచర్లలో మరో కేసుతోపాటు సూర్యాపేట పట్టణంలోని కుడకుడలో ఒక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో పాజిటివ్‌ నమోదైన వ్యక్తుల ఇండ్ల నుంచి చుట్టూ 500మీటర్ల రేడియస్‌లో రాకపోకలు పూర్తిగా నిషేధించారు. కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను ఆయా ప్రాంతాల్లోని ఇండ్లకే సరఫరా చేస్తున్నారు. పోలీసు బందోబస్తు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రతి అడుగునూ శానిటైజేషన్‌ చేస్తున్నారు. సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదైన వారి కుటుంబ సభ్యులతోపాటు.. వారితో కాంటాక్ట్‌ అయిన వారిని సైతం క్వారంటైన్‌కు తరలించగా పలువురి రిపోర్ట్‌ల కోసం జిల్లా వైద్యశాఖ అధికారులు వేచి చూస్తున్నారు. మరోవైపు జిల్లాలో లాక్‌డౌన్‌లో భాగంగా 13వ రోజు కూడా ప్రజలు పూర్తిస్థాయిలో ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసరాలకు మినహా ఎవరూ రోడ్డెక్కలేదు. పాజిటివ్‌ కేసులు నమోదైన నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణాల్లో వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.


logo