ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 01, 2020 , 02:09:44

వలస కూలీలకు ఆసరాగా..

వలస కూలీలకు ఆసరాగా..

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నల్లగొండ నమస్తే తెలంగాణ : కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పడింది. దీంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోవడంతో పక్క రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చిన వలస కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. వీరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు వలస కూలీలను గుర్తించగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. రెండు రోజుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 అందజేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని చర్యలు చేపడుతూనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా  చూస్తున్నారు. ప్రధానంగా లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు, సంస్థలు మూతపడడంతో ఏ పనులు జరుగడం లేదు. దీంతో పేద వర్గాలు, దినసరి కూలీలు ఉపాధి కోల్పోయి పట్టెడన్నం కోసం అర్రులు చాచే పరిస్థితి నెలకొంటుందని భావించిన ప్ర భుత్వం వారి కడుపు నింపే కార్యక్రమం తీసుకుంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12కిలోల బియ్యంతోపాటు ఇతర సరుకులు, రూ.1500 అందజేస్తున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇతర రాష్ర్టాలైన బిహార్‌, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాల నుంచి ఇటుక బట్టీలు, మార్కెట్‌ యార్డులు, సిమెంట్‌ కంపెనీలు తదితరాల్లో పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోవడంతో సీఎం కేసీఆర్‌ పెద్ద మనసు చేసుకొని వారికి కూడా రేషన్‌ బియ్యంతోపాటు రూ.500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  దీంతో రెండ్రోజులుగా   ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు బియ్యం, నగదు అందజేస్తున్నారు. మంగళవారం వరకు 80శాతం పూర్తికాగా నేడు మిగిలిన వారికి పంపిణీ చేయనున్నారు.  

సూర్యాపేట జిల్లాలో..

 • చివ్వెంల మండల కేంద్రంలో 8మంది వలస కూలీలకు 96కిలోల బియ్యం, రూ.4వేల నగదును ఆర్డీఓ మోహన్‌రావు, మండలంలోని వట్టిఖమ్మంపహాడ్‌లో ఆరుగురికి 72కిలోల బియ్యం, రూ.3వేల నగదును తాసిల్దార్‌ పి.సైదులు పంపిణీ చేశారు.  
 • తుంగతుర్తి మండలం వెలుగుపల్లి వద్ద నేషనల్‌ హైవే-365క్యాంపులో పని చేస్తున్న 110మంది వలస కూలీలకు 13.20కింటాళ్ల బియ్యం, రూ.55వేల  నగదును ఇన్‌చార్జి తాసిల్దార్‌ పుష్ప అందజేశారు.  
 • నాగారం మండలంలో 35మంది వలస కూలీలకు 4.20క్వింటాళ్ల బియ్యం, రూ.17,500 నగదును తాసిల్దార్‌ శ్రీకాంత్‌ పంపిణీ చేశారు. 
 • మద్దిరాల మండలంలో 20మందికి 2.40కింటాళ్ల బియ్యం, రూ.10వేల నగదును తాసిల్దార్‌ రాంప్రసాద్‌ పంపిణీ చేశారు. 
 • సూర్యాపేట మండలం జనగాం క్రాస్‌రోడ్‌లో 111మంది కూలీలకు 13.32కింటాళ్ల బియ్యం, రూ.55,500 నగదును కౌన్సిలర్‌ వడ్డెపల్లి రాజ్యలక్ష్మీరవి అందజేశారు. 
 • నూతనకల్‌ మండలంలో 12మందికి 1.44క్వింటాళ్ల బియ్యం, రూ.6వేల నగదును ఇన్‌చార్జి తాసిల్దార్‌ రాంప్రసాద్‌ అందజేశారు. 
 • మునగాల మండల కేంద్రంలో 24 మందికి 2.88 క్వింటాళ్ల బియ్యం,  రూ.12వేల నగదు తాసిల్దార్‌ పాండునాయక్‌  పంపిణీ చేశారు. 
 • చిలుకూరు మండల వ్యాప్తంగా 33 మందికి 3.96 క్వింటాళ్ల బియ్యం, రూ.16,500 నగదును తాసిల్దార్‌ శ్రీనివాసశర్మ, ఎంపీడీఓ ఈదయ్య, ఎస్‌ఐ నాగభూషణరావు పంపిణీ చేశారు.   
 • హుజూర్‌నగర్‌ మండలంలో 235 మందికి 28.20 క్వింటాళ్ల బియ్యం, రూ.1,17,500 నగదును తాసిల్దార్‌ జయశ్రీ, జడ్పీటీసీ సైదిరెడ్డి పంపిణీ చేశారు.  
 • మేళ్లచెర్వు మండలంలో 20 మందికి 2.40 క్వింటాళ్ల బియ్యం రూ.10 నగదు తాసిల్దార్‌ దామోదర్‌రావు అందజేశారు. 
 •  గరిడేపల్లి మండలం కీతవారిగూడెం, అప్పన్నపేట గ్రామాల్లో రెండు కుటుంబాలకు 24 కిలోల బియ్యం, రూ. వెయ్యి నగదును తాసిల్దార్‌ చంద్రశేఖర్‌ పంపిణీ చేశారు. 
 •  మఠంపల్లి మండలంలో యాతవాకిళ్లలో తమిళనాడు నుంచి వచ్చిన ముగ్గురికి  36కిలోల బియ్యం, రూ.1500 నగదు   సర్పంచ్‌  లక్ష్మీనరసింహరాజు అందజేశారు. పంచాయతీ కార్యదర్శి సీతారామయ్య, వీఆర్వో నరేశ్‌, జాని పాల్గొన్నారు. 
 • చింతలపాలెం మండలంలో 70 మందికి 8.40 క్వింటాళ్ల బియ్యం, రూ.35వేల నగదును తాసిల్దార్‌ కమలాకర్‌ పంపిణీ చేశారు. 


logo