శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 30, 2020 , 01:53:45

ఎక్కడి జనం అక్కడే..

ఎక్కడి జనం అక్కడే..

  • లాక్‌డౌన్‌తో జిల్లా అంతటా నిశ్శబ్ధ వాతావరణం
  • నిబంధనలు పాటించని వారిపై కొరఢా
  • సూర్యాపేటలో రెండు మెడికల్‌ షాపులు సీజ్‌
  • ఆదివారం నాన్‌వెజ్‌ స్పెషల్‌ కోసం ఎగబడ్డ జనం

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ ప్రభావం ఆదివారం జిల్లాలో స్పష్టంగా కనిపించింది. వాహనాలు, ప్రజల రద్దీ లేకపోవడంతో ప్రధాన వీధులన్నీ ఖాళీగా కనిపించగా జిల్లా అంతా నిశ్శబ్ధంగా మారింది. కరోనా నియంత్రణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టగా.. ఆ మేరకు ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో ప్రభుత్వం అనుకున్న విధంగా జనం ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకపోతే లాఠీలతో పని చెబుతుండడంతోపాటు వ్యాపార సంస్థలను సీజ్‌ చేస్తున్నారు. డిస్టెన్స్‌ బాక్సులు ఏర్పాటు చేయకుండా జన సమూహానికి కారణమవుతున్న జిల్లా కేంద్రంలోని బొడ్రాయిబజార్‌లోని రెండు మెడికల్‌ దుకాణాలను ఆదివారం మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. కాగా ఇటీవల సీఎం కేసీఆర్‌ నాన్‌వెజ్‌తోపాటు పండ్లు, కూరగాయలు బాగా తినాలని సూచించడంతో ఆదివారం మటన్‌, చికెన్‌, చేపల కేంద్రాల వద్ద జన సందడి కనిపించింది. దీంతో అధికారులు డిస్టెన్స్‌ బాక్సులు ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌, సూర్యాపేట కొత్త బస్టాండ్‌లోని కూరగాయల మార్కెట్‌ను అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి పరిశీలించారు. 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు వాహనాలను తనిఖీ చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. 


logo