సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 28, 2020 , 23:27:07

ధాన్యం మొత్తం కొంటాం..

ధాన్యం మొత్తం కొంటాం..

  • ప్రతి గింజ కొనాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన
  • ఐకేపీ-పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోళ్లకు చర్యలు 
  • ధాన్యం సేకరణకు కరోనా వైరస్‌ అడ్డంకి కాదు 
  • కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి
  • పాల్గొన్న కలెక్టర్‌, ఎంపీ, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు

యాసంగి వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు ప్రతి గింజ సేకరించేలా  అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో 1.26లక్షల హెక్టార్లలో వరి సాగైందని, సుమారు ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని.. హమాలీలు, డ్రైవర్లు, సిబ్బందికి పోలీస్‌ అధికారుల ద్వారా ప్రత్యేక పాసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు.

నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా 563 రెవెన్యూ గ్రామాలకు గాను 340 గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఐకేపీ సెంటర్ల ద్వారా యాసంగి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో పాటు ఎమ్మెల్యేలతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 1.26 లక్షల హెక్టార్లలో వరి సాగైందని, ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందన్నారు. ఆ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే కొనుగోలు చేస్తామన్నారు. ఇందుకు కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, శానిటైజర్లు సైతం ఏర్పాటు చేయాలన్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, నకిరేకల్‌, పీఏపల్లి, మల్లేపల్లి నుంచి ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదన్నారు. రైస్‌ మిల్లర్లు, లారీ యజమానులు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సహకరించాలని, హమాలీలు, డ్రైవర్లు, సిబ్బందికి పోలీసుశాఖ పాస్‌లు జారీ చేయాలని సూచించారు. వ్యవసాయపనులకు ఆటంకం కలుగవద్దని, ఈ విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో రైతులకు సహకరించాలన్నారు. మొదటగా 340 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అవసరాన్ని బట్టి పెంచేందుకు చర్యలు తీసుకంటామన్నారు. సీఎం కేసీఆర్‌ మద్దతు ధర విషయంలో రాజీపడవద్దని సూచించిన నేపథ్యంలో ఆదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 14 మండలాల్లో 20వేల మెట్రిక్‌ టన్నుల పైబడి, 11మండలాల్లో 10 వేల మెట్రిక్‌ టన్నులు, మరికొన్ని మండలాల్లో 5వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రానున్నందున ఎక్కువ ధాన్యం వచ్చే ప్రాంతాల్లో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ ప్రతి కేంద్రంలో ట్యాబ్‌ ద్వారా ఐడీపాస్‌వర్డు అందజేసి మిల్లర్లకు, రైతులకు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో పూర్తి నిల్వ సామర్థ్యం లేనందున ఇతర ప్రాంతాల్లో ధాన్యం నిల్వ చేస్తామని మిల్లర్స్‌ అసోసియేషన్‌ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌, ఎస్పీ రంగనాథ్‌, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో పాటు , డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీఎం నాగేశ్వర్‌రావు, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

బత్తాయి, నిమ్మ ఎగుమతులకు ఇబ్బంది లేదు : మంత్రి 

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జాతీయ స్థాయిలో సరుకులు, పంట దిగుబడులు రవాణా చేసే వాహనాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసినందున బత్తాయి, నిమ్మ ఎగుమతి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విద్యుత్‌ శాఖ మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం బత్తాయి, నిమ్మ, పుచ్చకాయ సాగు, దిగుబడి, ఎగుమతులపై నల్లగొండ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిరర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. బత్తాయి, నిమ్మల్లో సీ విటమిన్‌ అధికంగా ఉంటుందని, వీటివల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ ఉత్పత్తులను బయటకు విక్రయించకుండా జిల్లా ప్రజలు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈసారి కూరగాయల మార్కెట్‌ తరహాలోనే బత్తాయి, నిమ్మ, పుచ్చ వంటి ఉత్పత్తులను స్తానికంగా విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  ఉద్యాన శాఖ అధికారి సంగీతలక్ష్మి మాట్లాడుతూ  జిల్లాలో 46,800 ఎకరాల్లో బత్తాయి సాగు చేయగా 30 వేల ఎకరాల్లో కాపుకు వచ్చిందని 43 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందన్నారు.  16 వేల ఎకరాల్లో నిమ్మ వేయగా 8,800 ఎకరాలో కాపుకురాగా 52 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి, 5,300 ఎకరాల్లో సాగైన పుచ్చకాయ లక్ష మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. 


logo