శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 27, 2020 , 22:39:58

ఇంట్లోనే ఉందాం.. కరోనాను తరిమేద్దాం..

ఇంట్లోనే ఉందాం..  కరోనాను తరిమేద్దాం..

  • అత్యవసరమైతేనే ఇంటికొక్కరు బయటకు వెళ్లాలి 
  • కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ ముందుచూపు
  • లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు
  • విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా నియంత్రణ ఏర్పాట్ల పర్యవేక్షణ

‘కంటికి కనబడని శత్రువు వైరస్‌ మహమ్మారితో యావత్‌ ప్రపంచం యుద్ధం చేస్తోంది.. మనమంతా ఇళ్లలోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటిస్తే ఆ యుద్ధంలో పాల్గొన్నట్టే..’అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిత్యావసర, కూరగాయల దుకాణాలను మంత్రి పరిశీలించి జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రధాన రహదారుల్లో సోడియం హైడ్రోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో కరోనా నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నారని.. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలు పాటిస్తూ ప్రజలు తమవంతుగా సహకరించాలని కోరారు.

సూర్యాపేట టౌన్‌ : ప్రస్తుతం కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం యుద్ధం చేస్తోంది.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ స్వీయనియంత్రణ పాటిస్తే వారంతా యుద్ధంలో పాల్గొన్నట్లేనని.. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకే కఠినమైన నిర్ణయాలతో కట్టడి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పారిశుధ్య పనులు, రోడ్లపై సోడియం హైడ్రో క్లోరైట్‌ ద్రావణం స్ప్రే చేసే పనులను మంత్రి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యావసర వినియోగదారులకు, ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఏ పని లేకున్నా వృథాగా బయట తిరిగే వారితోనే అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు.  లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు ప్రత్యేక అభినందలు తెలిపారు. ప్రధానంగా కరోనా మహమ్మారి విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే సంక్రమిస్తుందని.. వైద్య దంపతులకు సైతం ఈ వైరస్‌ సోకడం దురదుష్టకరమన్నారు. అత్యధిక జాగ్రత్తలు పాటిస్తూ ..ఇతరుల ఆరోగ్యసంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పే వైద్యులకు ఈ మహమ్మారి సోకిందంటే నిర్లక్ష్యంగా బయట తిరిగే వారి పరిస్థితి ఏమిటనేది ఒకసారి ఆలోచించాలన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ వచ్చే నెల 14 వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌ను అంతా బాధ్యతగా పాటించాలని సూచించారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై కరోనా మహమ్మారి ప్రబలకుండా జాగ్రత్త పడాలని చేతులు జోడించి కోరుతున్నామని పేర్కొన్నారు. కూరగాయలు, నిత్యావసరాలకు ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేయించి ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడి ఒక్కరు కూడా చనిపోలేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అదృష్టవంతులన్నారు. కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చేయడంలో కేసీఆర్‌ ముందు చూపుతో ఉన్నారని మంత్రి కొనియాడారు. 


logo