సోమవారం 13 జూలై 2020
Suryapet - Mar 27, 2020 , 22:31:21

దూరం.. దూరం..

దూరం.. దూరం..

  • మరో మనిషికి తగులకుండా జాగ్రత్త పడుతున్న ప్రజలు
  • కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పెరిగిన అప్రమత్తత
  • జిల్లా అంతటా దుకాణాల దగ్గర ‘డిస్టెన్స్‌ మార్కింగ్‌'
  • బైకులపై ఒకరు.. కార్లలో ఇద్దరు మాత్రమే ప్రయాణం
  • ఐదో రోజు ఇళ్లకే పరిమితమైన ఉమ్మడి జిల్లా వాసులు 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రత గురించి ఉమ్మడి జిల్లా వాసుల్లో రోజు రోజుకూ అవగాహన పెరుగుతోంది. కూరగాయలు, నిత్యావసర దుకాణాల వద్ద సామాన్య జనం పాటిస్తున్న కనీస దూరం ఇందుకు అద్దం పడుతున్నది. ప్రధాన పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లోనూ జనం దూరం దూరంగా మసులుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇండ్లకే పరిమితమవుతుండగా... నిత్యావసరాల కోసం రోడ్డెక్కిన కొందరు కూడా ఇతరులను తాకకుండా జాగ్రత్త పడుతున్నారు. బంద్‌ నుంచి మినహాయింపు కలిగిన ప్రతి దుకాణం ముందు ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలో మీటర్‌ దూరం మార్కింగ్‌ సైతం వేయించారు. మరో వైపు ఉమ్మడి జిల్లాలో వరుసగా ఐదో రోజు కూడా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పట్టణాలతో పాటు ప్రధాన రహదారులపైన వాహనాల సందడి కన్పించలేదు. అవసరాల కోసం రోడ్లపైకి వచ్చే వాళ్లు సైతం బైక్‌పైన ఒక్కరు, కారులో ఇద్దరికి మించి ప్రయాణం చేయడం లేదు. రోజు రోజుకూ జనంలో అవగాహన పెరుగుతూ లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం, పోలీసులు, అధికారులకు ఊరట నిస్తోంది. 

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌ను జిల్లా ప్రజలు సైతం గౌరవించి పూర్తిస్థాయిలో బయటకు రాకుండా ఇండ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో జిల్లాలో ప్రధాన రహదారులతో పాటు పట్టణాల్లోనూ నిర్మానుష్యం కన్పిస్తోంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అద్దంకి- నార్కట్‌పల్లి, జాతీయరహదారి 65 నిర్మానుష్యంగా కనిపించాయి. అదే విధంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాలతో పాటు ఇతర పట్టణాల్లో ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నల్లగొండ జిల్లాలో వాడపల్లి, నాగార్జునసాగర్‌తో పాటు సూర్యాపేట జిల్లాలోని రామాపురం వద్ద ఆంధ్రా సరిహద్దులు పూర్తి స్థాయిలో మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయి జాతీయ రహదారులు సైతం నిర్మానుష్యమయ్యాయి. 

ప్రజాప్రతినిధుల పర్యటనతో పెరిగిన అవగాహన...

సీఎం కేసీఆర్‌ సూచన మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీంతో సామాజిక దూరం, కరోనా వైరస్‌పై అప్రమత్తత విషయంలో ప్రజలకు అవగాహన మరింత పెరిగింది. శుక్రవారం విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ తుంగతుర్తి-మద్దిరాల మండలాల్లో పర్యటించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకేంద్రంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పర్యటించి చెక్‌ పోస్టులతో పాటు కూరగాయల దుకాణాలు తనిఖీ చేశారు. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాలియాలో కిరాణ దుకాణాలు తనిఖీ చేయగా మాల్‌లో చెక్‌పోస్టును దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ పరిశీలించారు. రాకపోకలను నిలిపివేయాలని సూచించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు అగ్నిమాపక సిబ్బందితో వీధుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లించారు.


logo