ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 23, 2020 , 03:20:33

గడపదాటని భానుపురి

గడపదాటని భానుపురి

  • ఇల్లు వదలని జనం.. కరోనాపై యుద్ధం
  • ఉమ్మడి జిల్లా అంతటా జనతా కర్ఫ్యూ
  • రోడ్డెక్కని వాహనాలు.. వీధులన్నీ నిర్మానుష్యం
  • నిత్య, అత్యవసరాలు మినహా అన్నీ బంద్‌ 
  • పక్కింటికి సైతం వెళ్లకుండా... ఇండ్లకే పరిమితం
  • కర్ఫ్యూను నిరంతరం పర్యవేక్షించిన పోలీసులు

ఉమ్మడి జిల్లా వాసులు మూకుమ్మడిగా కరోనాపై యుద్ధం ప్రకటించారు. ప్రజలుపూర్తిగా ఇంటికే పరిమితం కాగా.. వాహనాలు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. అంబులెన్స్‌ వాహనాలు, అగ్నిమాపక తదితర అత్యవసర సర్వీసులు మినహా మరేవీ పనిచేయలేదు. వెరసి కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతమైంది. శనివారం అర్ధరాత్రి నుంచి రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు మినహా ఏ ఒక్కరూ రోడ్డెక్కలేదు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు సైతం ముందే సమకూర్చుకున్న నేపథ్యంలో ఆదివారం కుటుంబ సభ్యులతో అందరూ ఇళ్లలోనే గడిపారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు సైతం ఇల్లు వదిలి కాలు బయట పెట్టలేదు. ఉమ్మడి జిల్లా అంతటా చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలోనే గడిపారు.

సూర్యాపేట/తిరుమలగిరి,నమస్తేతెలంగాణ : కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రధా ని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు జనామోదం లభించింది.  ఆదివా రం ఉదయం 6 గంటల నుంచే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా కర్ఫ్యూలో స్వ చ్ఛందంగా పాల్గొన్నారు. ఉదయం పోలీస్‌ వా హనం సైరన్‌ మోగడంతో ఇంటినుంచి రావడం బంద్‌ చేశారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజ లు ఇంటికే పరిమితమయ్యారు. కేవలం పోలీసులు, మున్సిపల్‌, హెల్త్‌ సిబ్బంది మినహ ఎవరు రోడ్లు మీద కనిపించలేదు. జిల్లా కేం ద్రంతో ఏసీ సంజీవరెడ్డి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆర్డీఓ మోహన్‌రావు, డీఎస్పీ నాగేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజనులరెడ్డి పర్యటిస్తూ  సిబ్బందికి సూచనలు చేశారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో పచ్చీస్‌ ఆడుతూ జిల్లాలో జరుగుతున్న కర్ఫ్యూను సమీక్షించారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సైతం తన క్యాంప్‌ కార్యాలయానికే పరిమితయ్యారు.సాయంత్రం మంత్రి, కలెక్టర్‌ చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు

 తుంగతుర్తి నియోజకవర్గంలో..

తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా  జన తా కర్ఫ్యూ విజయవంతమైంది.  ప్రజలు కూడ స్వచ్ఛందంగా ముందుకు రావడంతో తెలంగాణ ఉద్యమ కాలం నాటి దృశ్యం దర్శనమిచ్చింది. ఇదే స్ఫూర్తి ప్రజల్లో కొనసాగితే తెలంగాణ నుంచి కరోనా తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదని పలువురు అభివర్ణించారు.  సాయంత్రం ఐదు గంట లకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇళ్ల ముందుకు వచ్చి చప్పట్లు కొట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్య బృందాలు, పోలీసులకు కృతజ్ఞతలు, ధన్య వాదా లు చెప్పారు. 

విదేశాల నుంచి వచ్చిన  వ్యక్తికి  కౌన్సిలింగ్‌ 

తిరుమలగిరి, నమస్తేతెలంగాణ : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలీపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల బ్యాంకాక్‌ నుంచి వచ్చి తిరుమలగిరిలో దుకాణం  నిర్వహిస్తున్నా డు. ఆదివారం ఎస్‌ఐ డేనియల్‌ కుమార్‌, తాసిల్దారు హరిశ్చంద్రప్రసాద్‌  అతడి వద్దకు  వెళ్లి  కౌ న్సిలింగ్‌ ఇ చ్చారు. ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.   ప్రతి ఒక్కరూ స్వీయ ని యంత్రణ పాటించాలని సూచించారు

నియోజకవర్గంలో విజయవంతం..

నకిరేకల్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జనతా కర్ఫ్యూ నకిరేకల్‌ నియోజకవర్గంలో విజయవంతమైంది. నకిరేకల్‌, కేతేపల్లి, కట్టంగూరు, చిట్యాల, నార్కట్‌పల్లిలో ఉదయం 7గంటల నుంచి రాత్రి వరకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. వాహనాల రాకపోకలతో ప్రతి క్షణం రద్దీగా ఉండే జాతీయ రహదారి బోసిపోయింది. పోలీసులు వీధులల్లో తిరుగుతూ ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తం చేశారు. వర్తక, వాణిజ్య వ్యాపారస్తులు స్వచ్ఛందంగా నిర్వహించి మూసివేశారు. అత్యవసరమైన మెడికల్‌ షాపులు తెరిచారు. ప్రభుత్వాలు విస్తృత ప్రచారం ప్రజలు ఒకరోజు ముందే తమకు అవసరమైన నిత్యావసర సరుకులు తెచ్చిపెట్టుకోవడంతో వారికి ఇబ్బంది కలుగలేదు. టీవీలు, సెల్‌ఫోన్లతో కొంతమంది కాలక్షేపం చేయగా మరికొంత ఆటలాడుతూ గడిపారు. చిట్యాల, గుండ్రాంపల్లిలో గ్రామస్తులు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.

‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం

చండూరు, నమస్తే తెలంగాణ : దేశవ్యాప్తంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూ మునుగోడు నియోజకవర్గంలో వందశాతం విజయవంతమైంది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని ఇంటికే పరిమితమయ్యారు. చండూరు, మునుగోడు మండలాల్లో సీఐ సురేశ్‌కుమార్‌, ఎస్‌ఐలు ఉపేందర్‌రెడ్డి, రజినీకర్‌లు సిబ్బందితో కలిసి పోలీస్‌ వాహనాలతో గస్తీ నిర్వహించారు. మర్రిగూడ మండలంలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటించారు. నాంపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో జనతా కర్ఫ్యూ విజయవంతమయ్యింది. శాలిగౌరారం మండలంలో జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఎస్‌ఐ హరిబాబు కర్ఫ్యూను తన సిబ్బందితో పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామస్తులు చప్పట్లు కొట్టి ఐక్యతను చాటారు.

ప్రజా శ్రేయస్సే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయం : జడ్పీటీసీ

మునుగోడు : ప్రజల శ్రేయస్సే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయమని జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ప్రధాన వీధులగుండా పంచాయతీ సిబ్బందితో ఆమె బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. అనంతరం సాయంత్రం 5గంటలకు మండలకేంద్రంలో ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె చప్పట్లు కొట్టి ఐక్యతను చాటారు. ఆమె వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, జంగిలి నాగరాజు, అంజయ్య, నర్సింహ పాల్గొన్నారు.

బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మృత్యుంజయ జపం

చిట్యాల : ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు ప్రజలు పాటిస్తున్న జనతా కర్ఫ్యూ సందర్బంగా రాష్ట్ర దూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మృత్యుంజయ జపం చేశారు. చిట్యాలలో దౌలతాబాదు వాసుదేవశర్మ ఇంట్లో బ్రహ్మణులు వేదశాస్త్రం ఆధారంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ మృత్యుంజయ జపములు, శాంతి మంత్రములు, వేద పారాయణములు జరిపారు. కార్యక్రమంలో శ్రీనివాసశర్మ, వినయ్‌మోహన్‌ శర్మ, రోహిత్‌ పండిట్‌లు పాల్గొన్నారు.


logo