బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 23, 2020 , 03:20:10

సరిహద్దుల్లో నిఘా

సరిహద్దుల్లో నిఘా

  • ఒక్క వాహనం కూడా జిల్లాలోకి రాకుండా చూడాలి 
  • వాడపల్లి చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ రంగనాథ్‌

ఇతర రాష్ర్టాల నుంచి ఒక్క వాహనం కూడా జిల్లాలోకి ప్రవేశించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సరిహద్దు చెక్‌పోస్టు అధికారులను ఎస్పీ రంగనాథ్‌ ఆదేశించారు.  ఆదివారం ఆంధ్రా సరిహద్దు వాడపల్లి చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేశారు. అనుమానితులపై నిఘా ఉంచాల్సిందిగా పోలీసులు, వైద్యాధికారులకు సూచించారు.

దామరచర్ల : ఇతర రాష్ర్టాల నుంచి ఒక్క వాహనం కూడా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మండలంలోని పోలీసు అధికారులను నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఆదేశించారు. మండలంలోని వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టును ఆయన ఆదివారం తనిఖీ చేశారు. స్థానిక పోలీసులు, వైద్యాధికారుల నుంచి వివరాలు సేకరించారు. రాత్రి నుంచి వాడపల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలను నిలిపివేయడంతో సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయాయి. దీనిపై ఎస్పీ ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ ప్రబలకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అనుమతించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ బాధ్యతగా తీసుకొని వైరస్‌ నివారణకు  సహకరించాలన్నారు. వాహనాల్లో అనుమానాస్పదంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని సరిహద్దుల్లో వాహనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ జనతా కర్యూ ఉంటుందన్నారు. మండలంలోని పోలీసులు, వైద్యాధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్‌ సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐ నర్సింహారావు, మండల వైద్యాధికారి వహెదాబేగం ఉన్నారు. 


logo