ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 23, 2020 , 03:03:21

నవ వధువు ఆత్మహత్య

నవ వధువు ఆత్మహత్య

  • వారం రోజులకే బలవన్మరణం
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, రూ.కోట్ల ఆస్తులున్నాయని మోసం 
  • రెడ్‌ పెన్నుతో సూసైడ్‌ నోట్‌

చివ్వెంల : ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. వారి ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉండగా వారిని అల్లారు ముద్దుగా పెంచి.. బాగా చదివించారు.. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు.. పెద్ద కూతురు సీఏ(చార్టర్డ్‌ అకౌంటెంట్‌) చదువు పూర్తి కాగా మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అదే తడవుగా హైదరాబాద్‌కు చెందిన ఓ శ్రీమంత కుటుంబం అని.. వారి కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని భారీ డంభాచారంతో పెద్ద కూతురుకు సంబంధం వస్తే నమ్మి ఈ నెల 15న సూర్యాపేటలో అత్యంత ఘనంగా వివాహం చేశారు. వారి సంతోషం వారం కూడా నిలువలేదు. కూతురు అత్తింటికి వెళ్లి ఆరో రోజు శనివారం రాత్రి తల్లిగారింటికి చేరుకోగా మరుసటి రోజు ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దిండు కింద ఉన్న డెత్‌ నోట్‌ ఆధారంగా అత్తింటి వాళ్లు చెప్పినవన్నీ అబద్ధాలేనని.. పెళ్లి విషయంలో మోస పోయామని.. వరుడికి ఉద్యోగం లేదు.. వారు ముందు చెప్పినట్లుగా రూ.కోట్ల ఆస్తులు లేవని తేలింది. అంతే కాకుండా వారికి ఉన్న అప్పులు తీర్చేందుకు అదనపు కట్నం కోసం వేధించేవాడని, తీసుకురాని పక్షంలో విడాకులు ఇస్తామని బెదిరించారని లేఖలో ఉంది. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన నవ వధువు మౌనికరెడ్డి కాగా ఆమె తల్లిదండ్రులు సామ ఇంద్రారెడ్డి, మంజులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి రోదనలను నిలువరించడం ఎవరి తరం కాలేదు. పెళ్లయిన ఇంటి నుంచి వెళ్లిన బంధువులు మళ్లీ నవ వధువు అంత్య క్రియల కోసం వచ్చి దుఃఖసాగరంలో మునిగిపోయారు. . 

15న ఘనంగా వివాహం..

డెత్‌నోట్‌తోపాటు మౌనికారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మౌనికారెడ్డికి ఈ నెల 15న హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌కు చెందిన బద్దం శ్రీనివాస్‌రెడ్డి, సునీతల కుమారుడు సాయికిరణ్‌రెడ్డితో అత్యంత ఘనంగా వివాహం చేశారు. వివాహం కుదుర్చుకునే ముందు సాయికిరణ్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని, హైదరాబాద్‌ పరిసరాల్లో రూ.కోట్ల విలువైన భూములు ఉన్నట్లు చెప్పారు. దీంతో నమ్మిన మౌనిక తల్లిదండ్రులు సామ ఇంద్రారెడ్డి, మంజుల రూ.10లక్షలతోపాటు 35 తులాల బంగారం, 4కిలోల వెండి వస్తువులు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం రెండు కుటుంబాలు సంతోషంగా తదుపరి కార్యాలు చేస్తూ ఉండగా పెళ్లయిన నాలుగో రోజే సాయికిరణ్‌రెడ్డి కుటుంబానికి అప్పులు ఉన్నట్లు మౌనిక పసిగట్టింది. ఈ విషయమై తన భర్తను అడుగగా జాబ్‌ లేదని, అలాగే ఆస్తులపై సరైన సమాధానం చెప్పకకపోవడంతో ఆమెలో ఆందోళన మొదలైంది. నాలుగు రోజులకే తమ పరిస్థితిని గుర్తించిందని భావించిన సాయికిరణ్‌రెడ్డి కుటుంబం అదనపు కట్నం కావాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే ఉగాది కోసం మౌనిక తన తల్లిగారింటికి వెళ్లాల్సి ఉండగా ఆదివారం జనతా కర్ఫ్యూ ఉన్నందున సోమవారం వచ్చి తీసుకెళ్తానని తండ్రి చెప్పాడు. దీనికి అంగీకరించని కూతురు మౌనికారెడ్డి తక్షణమే రావాలని చెప్పడంతో శనివారమే వెళ్లి తీసుకొచ్చారు. 

అక్కడే అనుమానం వచ్చింది..

కూతురు మౌనికను తీసుకొచ్చేందుకు తండ్రి ఇంద్రారెడ్డి ఆయన భార్య మంజులతోపాటు తన స్నేహితుడితో కలిసి శనివారం ఘట్‌కేసర్‌ వెళ్లారు. తొలుత తన అల్లుడి కుటుంబం చెప్పిన భూములను చూసేందుకు వెళ్లారు. భూములను చూపించేందుకు అల్లుడి తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేసి రావాలని కోరారు. మూడు గంటలు అయినా రాకపోవడంతో ఇంద్రారెడ్డికి అనుమానం వచ్చి సీరియస్‌గా మాట్లాడడంతో ఐదు నిమిషాల్లోపే శ్రీనివాస్‌రెడ్డి, ఆయన భార్య సునీత, కుమారుడు సాయికిరణ్‌రెడ్డితోపాటు కూతురు వినీత వచ్చారు. భూములు ఇవే అంటూ ఒక్కోసారి ఒక్కటి చూపిస్తుండగా అనుమానం వచ్చిన ఇంద్రారెడ్డి అసలు భూములు ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి వారు ఇంద్రారెడ్డి, మంజులపై దాడి చేశారు. దీంతో స్నేహితుడు సర్దిచెప్పి అల్లుడు సాయికిరణ్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లగా అక్కడ మరోసారి ఘర్షణ జరిగింది. ఆ వెంటనే కూతురును తీసుకొని శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో సూర్యాపేటకు చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగిన సంఘటనలపై చర్చించుకుంటూ మెళకువతోనే ఉండగా కూతురు మౌనిక తనకు జరిగిన మోసాన్ని తండ్రికి వివరిస్తూ రోదించింది. అనంతరం అంతా హాల్‌లోనే నిద్రకు ఉపక్రమించగా మౌనికారెడ్డి మాత్రం బెడ్‌రూంలోకి వెళ్లి గడియ వేసుకొని చీరతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం గమనించిన తల్లిదండ్రులు రోదిస్తుండగా చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని తాసిల్దారు పి.సైదులు, ఎంపీడీఓ జమలారెడ్డి, వైద్యాధికారి ప్రదీప్‌కుమార్‌ చేరుకొని పంచనామా నిర్వహించగా పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్‌ దవాఖానకు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు మౌనిక భర్త సాయికిరణ్‌రెడ్డి, అత్తామామలు శ్రీనివాస్‌రెడ్డి, సునీతతోపాటు ఆడబిడ్డ వినీతలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్‌.లవకుమార్‌ తెలిపారు.

మోస పోయాను.. 

  • మానసిక ప్రశాంతత లేదు..
  • మౌనిక రాసిన సూసైడ్‌ నోట్‌ 

“నాకు మానసిక ప్రశాంతత లేదు. నాకు పెళ్లి అయ్యి ఒన్‌ వీక్‌ కూడా అవ్వలేదు. నా భర్తకి జాబ్‌ లేదని ఎంగేజ్‌మెంట్‌ తర్వాత చెప్పాడు. అప్పుడు నేనేం చేయలేకపోయాను. పెళ్లయ్యాక ఆస్తి విషయం రాంగ్‌ చెప్పారు. అడిగితే మా పేరెంట్స్‌ మీదకు దాడి చేస్తున్నారు. వాళ్లు నన్నేం అనలేదు..ఇప్పటి వరకు వాళ్లు మంచి అనే ముసుగు వేసుకొని నటిస్తున్నారు. ఆ ఇంట్లో ఉండాలంటే భయమవుతుంది. ఇక్కడ విషయం డబ్బు గురించి కాదు. వాళ్ల వ్యక్తిత్వం మంచిది కాదనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉండాలనిపించట్లేదు. నా లైఫ్‌లో ఫాస్ట్‌ 25 ఇయర్స్‌ హ్యాప్పీగా లేను. కనీసం పెళ్లయ్యాక కూడా హ్యాప్పీగా ఉండలేక పోతున్నానని బాధగా ఉంది. ఐయామ్‌ సారీ డాడ్‌... మీరు నా గురించి చాలా బాధపడుతున్నారు. ఈ విషయంలో మీరు అమ్మ నా కోసం గొడవపడకండి. అమ్మ, నాన్న, చెల్లి, ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌ అందరినీ మిస్‌ అవుతున్నా.. గుడ్‌బై అందరికీ. కానీ నా చావుకి కారణం ఎవ్వరూ కాదు. నా చావుకి కారణం నా మానసిక అశాంతి. నేను సంతోషంగా లేను. మోసపోయాను. ఒకటి తర్వాత ఒక్కొక్కటి వాళ్ల గురించి తెలుస్తుంటే పిచ్చెక్కుతుంది.. అన్నీ అబద్ధాలే వాళ్లవి..   ఎప్పటికీ తిరిగి రాని మీ ... మౌని”logo