శుక్రవారం 29 మే 2020
Suryapet - Mar 10, 2020 , 01:05:23

ముగిసిన మారుతీరావు అంత్యక్రియలు

ముగిసిన మారుతీరావు అంత్యక్రియలు

మిర్యాలగూడ టౌన్‌ : ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  తిరునగరు మారుతీరావు అంత్యక్రియలు సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం అనంతరం ఆదివారం రాత్రి మిర్యాలగూడలోని ఆయన ఇంటికి తరలించారు. మారుతీరావు మృతదేహాన్ని కడసారి చూసేందుకు బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులతో పాటు పట్టణ ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, ఆర్యవై సంఘం నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు మారుతీరావు మృతదేహాన్ని రెడ్డికాలనీ మీదుగా ఇస్లాంపురం షాబునగర్‌ హిందూ శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మారుతీరావు మృతదేహానికి తమ్ముడు శ్రవణ్‌కుమార్‌ తలకొరివి పెట్టాడు. 

అమృతను అనుమతించని  బంధువులు, స్థానికులు

మారుతీరావు మృతదేహాన్ని ఆదివారం రాత్రి మిర్యాలగూడకు తీసుకొచ్చినప్పటికీ ఆయన కూతురు అమృత కడసారి చూపుకోసం ఇంటికి రాలేదు. అయితే సోమవారం పోలీసు బందోబస్తు మధ్య శ్మశానవాటికకు తరలివచ్చింది. దీంతో మారుతీరావు బంధువులు, స్థానికులు ఆమె ను లోనికి అనుమతించలేదు. ‘అమృత గోబ్యాక్‌' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆమె తండ్రి పార్థీవదేహాన్ని చూడకుండానే వెనుదిరిగి వెళ్లింది. 

పోలీసు బందోబస్తు..

మారుతీరావు ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు కావడంతో.. అతడి అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మారుతీరావు ఇంటి నుంచి అంతిమయాత్ర సాగే ప్రాంతాలతో పాటు శ్మశాన వాటిక వద్ద కూడా పోలీసులను మోహరించారు. కూతురు అమృత విన్నపం మేరకు కడసారి చూసేందుకు పోలీసు వాహనంలోనే శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చారు. అయితే బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆమెను అక్కడికి నుంచి తరలించారు.  

అమ్మ వస్తే ఆదరిస్తా..  అమృత(మారుతీరావు కూతురు)

మారుతీరావు ఆత్మహత్య అనంతరం ఒంటరి అయిన తన తల్లి గిరిజారాణి వస్తే ఆదరిస్తానని, తాను మాత్రం ఆమె వద్దకు వెళ్లనని ఆమె కూతరు అమృత అన్నారు. సోమవారం ముత్తిరెడ్డికుంటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తండ్రి ఆత్మహత్యపై స్పందిస్తూ ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవని, తన కోసం మారుతీరావు చనిపోలేదని పేర్కొన్నారు. తన కోసమే చనిపోవాలనుకుంటే ఎప్పుడో చనిపోవాలని పేర్కొంది. మారుతీరావుకు ఆయన తమ్ముడు శ్రవణ్‌కు ఆస్తి వివాదాలు నెలకొన్నాయని, శ్రవణ్‌ ఇటీవల మారుతీరావుపై చేయి చేసుకున్నట్లు తనకు తెలిసిందని వివరించింది. మారుతీరావు ఆస్తులు తనకు అవసరం లేదని, శ్రవన్‌తో తనకు ఎలాంటి హానీ ఉండనప్పటికీ తన తల్లికి ప్రాణాపాయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ప్రణయ్‌ని చంపిన కేసులో మారుతీరావుకు చట్టపరంగా శిక్షపడితే సంతోషంగా ఉండేదని, ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందన్నారు. 

ఆస్తికోసమే ఆరోపణలు .. శ్రవణ్‌కుమార్‌(మారుతీరావు సోదరుడు)

ఆస్తికోసమే అమృత తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రి మారుతీరావుపై ప్రేమ ఉంటే ఆదివారం రోజు ఇంటికి రాకుండా, ప్రచారం కోసం శ్మశాన వాటికవద్దకు వచ్చిందన్నారు. అన్న మారుతీరావుతో ఆస్తుల పరంగా తనకు ఎలాంటి విభేదాలు లేవని, తమకు అప్పులు సైతం లేవన్నారు. అమృత ఆరోపిస్తున్నట్లుగా తన వదిన గిరిజారాణికి ప్రాణాపాయం ఉన్నదని అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ పొందవచ్చన్నారు. ప్రణయ్‌ హత్య కేసులో సైతం తన పాత్ర ఏమి లేదని పోలీసులు నిర్థారించినట్లు పేర్కొన్నారు. 


logo