శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Mar 10, 2020 , 01:06:42

మనమే నెం.1

మనమే నెం.1

 (నీలగిరి):ఇప్పటికే పశుగణన నిర్వహించిన సంవర్థకశాఖ అధికారులు ప్రస్తుతం పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందిస్తూనే వాటి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటు ఆయా పశువులకు యూనిక్‌ ఐడీ నెంబర్‌ను కేటాయిస్తూ.. చెవికి ట్యాగ్‌ వేస్తున్నారు. పశువుల హెల్త్‌ ప్రొఫైల్‌ను క్రెడిట్‌ కార్డులో పొందుపరుస్తూ.. ఆయా వివరాలను కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.  

గాలికుంటు నివారణే లక్ష్యం

గాలికుంటు వ్యాధితో పశువుల ఉత్పత్తి తగ్గుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఆన్‌ యానిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. టీకాలు ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన 136 బృందాలను పశుసంవర్థకశాఖ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి షెడ్యూల్‌ ప్రకారం ఊరూర వెళ్తున్న ప్రత్యేక బృందాలు పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు నిర్వహిస్తున్నాయి. టీకా ఇచ్చిన వెంటనే 12 డిజిట్‌ నెంబర్‌తో కూడిన యూనిక్‌ ఐడీ కేటాయించి ఆయా పశువు చెవికి ట్యాగ్‌ వేస్తున్నారు. దీంతో పాటే పశువు హెల్త్‌కార్డును యజమానికి అందజేస్తున్నారు. ఈ కార్డు ఆధారంగా ఆయా పశువుకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఆయా పశువుల వివరాలను పశు సంవర్థక శాఖ ఉద్యోగులు కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో పశువుల హెల్త్‌ ప్రొఫైల్‌..

రాష్ట్రంలో ఇప్పటికే పశుగణన చేపట్టగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఇదే తొలిసారి. ప్రతి పశువు వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తుండటంతో హెల్త్‌ ప్రొఫైల్‌ అందుబాటులోకి వస్తోంది. గతంలో వ్యాక్సిన్లు, టీకాలు వేసి కొమ్ములకు రంగులు వేసేవారు. కానీ ప్రస్తుతం టీకాలు వేసిన ప్రతి పశువుకు చెవికి ట్యాగ్‌ వేయడంతో పాటు వివరాలు INAPH వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా పశువుకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన తేది..మళ్లి ఎప్పుడు వేయాలనే వివరాలను గుర్తించి వేసేందుకు వీలుంటుంది. హెల్త్‌కార్డు పశుఆధార్‌ నెంబరు ఆధారంగా క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్‌ ఇస్తూ పశువుల ఉత్పత్తి, పునరుత్పత్తి తగ్గకుండా జాగత్త్రలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.   

మనమే నెంబర్‌ వన్‌...

జిల్లా వ్యాప్తంగా 2,06,585 తెల్ల పశువులు, 3,17,200 నల్ల పశువులు, 11.15లక్షల గొర్రెలు, 3.44 మేకలు, 6700 పందులు మొత్తం 19.91 లక్షల మూగ జీవాలకు ప్రత్యేకంగా టీకాలు, వ్యాక్సిన్‌లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెల్ల, నల్ల పశువులకు వెంటనే ట్యాగ్‌ చేయాలని నిర్ణయించారు. ఆదిశగా ప్రారంభమైన కార్యాక్రమం నెలరోజులగా జిల్లాలో కొనసాగుతోంది. వాటికి ట్యాగ్‌లు వేయడం దాదాపు పూర్తి కావచ్చినా అన్‌లైన్‌లో వాటి వివరాలు నమోదు చేసేందుకు మాత్రం సమయం పడుతోంది. ఇప్పటి వరకు సుమారు లక్ష పశువులకు యూనిక్‌ నెంబర్‌లు వేయడంతో నల్లగొండ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో, దేశంలో మూడో స్థానంలో నిలిచింది.


logo