ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 10, 2020 , 00:55:24

రాష్ట్ర బడ్జెట్‌తో అభివృద్ధి పరుగులు

రాష్ట్ర బడ్జెట్‌తో అభివృద్ధి పరుగులు

తిప్పర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ర్టాభివృద్ధి పరుగులు పెట్టనుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం ఆయన తిప్పర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులకు వెన్నుదన్నుగా ఉండి రాజులను చేసేవిధంగా కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఎంతో సంతోషకరమన్నారు. గతంలో ఏప్రభుత్వాలు కూడా ఇంత మొత్తంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోగా.. బడ్జెట్‌ను విమర్శించడం ప్రతిపక్షాలకు సరికాదన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడితే వీటిపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా గతంలో ఏమీచేయని కాంగ్రెస్‌ వారు కూడా విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. రైతుల పక్షపాతిగా కేసీఆర్‌ దేశ చరిత్రలో నిలుస్తున్నారన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.25 వేల లోపు రుణాలు మాఫీ చేయడం సంతోషకరమన్నారు. లక్ష వరకు ఉన్న రుణాలు కూడా విడతలవారిగా మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రుణమాఫీతోపాటు రైతుబీమా, రైతుబంధుకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు. ఇది జనరంజక బడ్జెట్‌ అని ఎంపీ కొనియాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మిలింగారావు, స్థానిక సర్పంచ్‌ రొట్టేల రమేశ్‌, మాజీ సర్పంచ్‌ జాకటి మోష, టీఆర్‌ఎస్‌ నాయకులు సిరసవాడ సైదులు, బాలయ్య, గుండెబోయిన సైదులు, శంకర్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


logo