శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Mar 08, 2020 , 00:52:53

ఎస్సారెస్పీ కాల్వలకు మహర్దశ

ఎస్సారెస్పీ కాల్వలకు మహర్దశ

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గత ఉమ్మడిరాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, వ్యవసాయం, సాగునీటిపై కనీస ఆలోచన చేయకపోగా తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానంగా అన్నదాతకు పూర్తి భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నారు. అన్నదాతలకు 24గంటల నిరంతర ఉచితవిద్యుత్‌, రుణమాఫీ, భూరికార్డుల ప్రక్షాళన, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, పంట పెట్టుబడి సాయం, రూ.5 లక్షల ఉచిత బీమా  ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పథకాలు వారికి ధైర్యాన్నిస్తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక అయిన గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా అది జిల్లాకు వరప్రదాయినిగా మారి ఇప్పటికే తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతోపాటు కోదాడలో కొన్నిమండలాలు సస్యశ్యామలమయ్యాయి. గత ప్రభుత్వాలు సూర్యాపేట జిల్లాకు సాగునీటిని అందించేందుకు గోదావరిపై ప్రత్యేకంగా ప్రాజెక్టు లేకుండానే అరకొరగా కాల్వలు తవ్వినా ఒక్కరోజు చుక్క నీరు వచ్చిన దాఖలాలు లేవు. 2014 తరువాత మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చొరవతో మూడుసార్లు జిల్లాకు గోదావరి జలాలను తీసుకురాగా అమసరమున్న చోట కొత్తగా కాల్వలు తీయడం, ఉన్న కాల్వలకు, తూములకు మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు చేయించారు. సుమారు రూ.12కోట్ల వ్యయంతో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలకు లైనింగ్‌ పనులు పూర్తిచేశారు.


చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా..  

గోదావరిపై కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఆయకట్టు చివరి ఎకరాకు సైతం నీటిని అందించాలనే ఉద్దేశంతో మంత్రి జగదీశ్‌రెడ్డి అకుంఠిత దీక్షబూనారు.. ఈ సీజన్‌లో ఇప్పటికే దాదాపు నాలుగు నెలలుగా నీటి సరఫరా అవుతుండగా మళ్లీ వానాకాలం సీజన్‌ నాటికి కాల్వల ఆధునీకరణ చేపడితే నీటి వృథా తగ్గి అత్యంత సులువుగా పంట పొలాల్లోకి నీరు చేరుతుందని భావించారు.  ఇదే తడవుగా ఇటీవల హైదరాబాద్‌లో ఇరిగేషన్‌, ఎస్సారెస్పీ అధికారులతో సమీక్ష చేసి ఎక్కడెక్కడ కాల్వలకు మరమ్మతులు అవసరమో గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి కాల్వల వెంట పర్యటిస్తున్నారు. జిల్లా పరిధిలో సుమారు 2,12,950ఎకరాల ఆయకట్టు ఉండగా.. తుంగతుర్తి నియోజకవర్గంలో 92,456ఎకరాలు, సూర్యాపేట 80,637, కోదాడ నియోజకవర్గంలో 39,866 ఎకరాలు ఉంది. డీబీఎం 69, 70ద్వారా తుంగతుర్తి, 71ద్వారా సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. కాల్వల  ఆధునీకరణ పూర్తయితే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని శ్రీరాంసాగర్‌ ఫేజ్‌-2 ఆయకట్టు పరిధిలోని దాదాపు 465 మేజర్‌, మైనర్‌ చెరువులతోపాటు కుంటలు గోదావరి జలాలతో కళకళలాడనున్నాయి. 


logo