బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 05, 2020 , 01:18:21

ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకుందాం

ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకుందాం

 సూర్యాపేట టౌన్‌ : ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలువార్డుల్లో పట్టణ ప్రగతిలో పాల్గొని 20వ వార్డులో పలుచోట్ల మొక్కలు నాటారు. ఇంటిపంటపై అవగాహన కల్పించి సుధాకర్‌ పీవీసీ  ఆధ్వర్యంలో గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో పేదరికాన్ని జయించవచ్చు కానీ అనారోగ్యాన్ని జయించడం కష్టతరమన్నారు.  పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్‌ కవర్లు, నాణ్యతలేని ప్లాస్టిక్‌ వస్తువులే ప్రధాన కారణమని, అందుకే ఆ మహమ్మారిని అంతమొందించేందుకు అంతా సిద్ధం కావాలన్నారు. ప్రజలంతా ప్రకృతి ప్రేమికులుగా మారి హరితహారం ద్వారా వీధులతోపాటు ఇంటిపంట ద్వారా మిద్దెలన్నీ పచ్చదనంతో నింపాలన్నారు. గడిచిన ఆరేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని, పల్లె, పట్టణ ప్రగతితో మిగిలిన అభివృద్ధిని సాధించుకుని పూర్తిస్థాయిలో అన్ని రంగాలను తీర్చిదిద్దుకుందామన్నారు. 


ఇకపై అడవులను పెంచుకుంటూ అమ్మలాంటి భూమిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంచి వాటిని బాధ్యతగా సంరక్షించాలన్నారు.  ఆరోగ్యానికి హాని కలిగించే రసాయన ఎరువులను మాని సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను వాడి ఆరోగ్య జీవితాన్ని పొందాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో అంతా భాగస్వాములు కావడంతో కంపచెట్లు, పిచ్చిచెట్లు, ముళ్లపొదలు తొలిగించి విరివిగా మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్‌ రామానుజులరెడ్డి, ప్రొఫెసర్‌ శ్యాంసుందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్ట కిశోర్‌, కౌన్సిలర్‌ అన్నెపర్తి రాజేశ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జుట్టుకొండ సత్యనారాయణ, అధికారులు, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.  logo