శుక్రవారం 29 మే 2020
Suryapet - Mar 04, 2020 , 03:55:01

వేగంగా జడ్చర్ల - కోదాడ హైవే పనులు

వేగంగా జడ్చర్ల - కోదాడ హైవే పనులు
  • కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-167) నిర్మాణ పనులు
  • ముమ్మరంగా జరుగుతున్నాయి. రహదారి నిడివి 215కిలోమీటర్లు కాగా.. ఐదు
  • ప్యాకేజీలుగా విభజించి రూ.1200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు పురోగ
  • తిలో ఉన్నాయి. పాత రోడ్డును పూర్తిగా తొలగించడం, రోడ్డు పక్కన విద్యుత్‌
  • స్తంభాల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఆర్‌అండ్‌బీ పరిధిలోని ఏడు మీటర్ల
  • పాత రోడ్డును 10మీటర్ల మేర విస్తరిస్తున్నారు.

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ :  కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి పనులు నిర్వహిస్తున్నారు. పాత రోడ్డును పూర్తిగా తొలగించటం, రోడ్డుపక్కన ఉన్న కరెంటుస్తంభాలు. చెట్లు తొలగించడం, కల్వర్టుల నిర్మాణాలతోపాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి అంచనా సమయంలోనే బైపాస్‌రోడ్లు లేకుండా ఉండాలని ఆదేశాలు జారీచేయడంతో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డుపైనే రోడ్డు నిర్మిస్తున్నారు. మొత్తం రహదారి విస్తరణ పనులు 214కిలోమీటర్ల నిడివిలో ఉన్నది. ఈ రోడ్డు జాతీయ రహదారిగా మారడంతో మరింత వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు 7మీటర్ల  వెడల్పుతో బీటీ ఉంది. కాగా దానిని జాతీయరహదారిగా(ఎన్‌హెచ్‌-167)గుర్తించడం వలన 10మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు మంజూరు చేసింది. 


ఐదు ప్యాకేజీలుగా విస్తరణ పనులు..

ఐదు ప్యాకేజీలుగా విస్తరణ పనులు చేపడుతున్నారు. జడ్చర్ల- కల్వకుర్తి, కల్వకుర్తి- మల్లేపల్లి రెండు ప్యాకజీలు కాగా నల్లగొండ,సూర్యాపేట జిల్లాల పరిధిలో  మూడు ప్యాకేజీలు  మల్లేపల్లి- అలీనగర్‌, అలీనగర్‌- మిర్యాలగూడ 80కిలోమీటర్ల వరకు రూ.500 కోట్లతో మిర్యాలగూడ-కోదాడ వరకు 40 కిలోమీటర్లు రూ.200 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా పలు చోట్ల కల్వర్టులు నిర్మాణం, చెట్లు, విద్యుత్‌ స్తంభాల తొలగింపు పనులను వేగంగా పూర్తిచేస్తున్నారు. 


నాలుగులైన్లు ఉన్నచోటే డివైడర్లు..

కోదాడ- జడ్చర్ల రహదారి 100ఫీట్లు ఉండే విధంగా విస్తరిస్తారు. దీనిలో 10మీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈరోడ్డు 7మీటర్లు ఉండగా 10మీటర్లకు రోడ్డు విస్తరిస్తున్నారు. రోడ్డుకు డివైడర్లు ఏర్పాటుచేయరు. కేవలం ప్రధాన పట్టణాలు ఉన్నచోట నాలుగులైన్లు రోడ్డు నిర్మించి మధ్యన డివైడర్లు నిర్మించనున్నారు. కాగా ఈ రోడ్డుకు ఎక్కడ బైపాస్‌రోడ్డులు లేకుండా కేవలం ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పైనే జాతీయ రహదారి పనులు చేపడుతున్నారు. 


తీరనున్న వాహనదారుల కష్టాలు..

ప్రస్తుతం 7మీటర్లు ఉన్న రోడ్డుపైన వాహనాల రద్దీ అధికంగా ఉండటం వలన వాహనదారులు రాకపోకలకు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి పనులు పూర్తిఅయితే నాగార్జునసాగర్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, మల్లేపల్లి, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట వెళ్లే వాహనదారులకు ప్రయాణం సులువుగా ఉంటుంది. రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.


నాణ్యతతో రహదారి పనులు..

కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అలీనగర్‌ టూ మిర్యాలగూడ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముందుగా చెట్టు తొలగింపు కరెంటు స్తంభాల తొలగింపు పనులు పూర్తి చేశాం. అవసరమైన చోట కల్వర్టులు నిర్మాణం చేశాం. రోడ్డు విస్తరణ పనులు నాణ్యతతో జరుగుతున్నాయి.

- తానేశ్వర్‌ డీఈ, ఎన్‌హెచ్‌-167


logo