శుక్రవారం 05 జూన్ 2020
Suryapet - Mar 03, 2020 , 01:40:19

నేరెడుగొమ్ములో విషాదఛాయలు

నేరెడుగొమ్ములో విషాదఛాయలు

నేరెడుగొమ్ము(చందంపేట) : నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన కొట్ర ప్రదీప్‌కుమార్‌(40) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కొట్ర యాదయ్య, కలమ్మ దంపతులకు ప్రదీప్‌తో పాటు మరో కూతురు ఉంది. వీరు స్వగ్రామంలోనే ఉంటూ కిరాణం షాపు పెట్టుకొని జీవనం సాగిస్తూ పిల్లలను బాగా చదివించారు. తల్లి కళమ్మ 14సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ప్రదీప్‌ ప్రాథమిక విద్య దేవరకొండ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో పూర్తి చేశాడు. చదువులో ప్రతిభ కనబర్చడంతో అతడి తండ్రి ఉన్నత చదువులకు హైదరాబాద్‌కు పంపించాడు. అక్కడే బీటెక్‌ పూర్తి చేసిన ప్రదీప్‌కుమార్‌కు పదేళ్ల కిందట కల్వకుర్తికి చెందిన స్వాతి (35)తో వివాహమైంది. వీరికి కల్యాణ్‌కృష్ణ(5), జయకృష్ణ(2) ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడేళ్ల కిందట బెంగుళూర్‌లోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరిన ప్రదీప్‌ ఉద్యోగోన్నతిపై హైదరాబాద్‌ బ్రాంచ్‌కు బదిలీ అయ్యాడు. పండుగ, సెలవు రోజుల్లో స్వగ్రామానికి వచ్చి తండ్రి, గ్రామస్తులతో కలిసిమెలిసి సరదాగా గడిపేవాడు. కిరాణ దుకాణంలో తండ్రికి సాయం చేసేవాడు. ఇదిలా ఉండగా నిత్యం ఫోన్‌ కాల్స్‌, వీడియో కాల్‌ చేసి క్షేమ సమాచారం తెలుసుకునే తన కుమారుడు రెండ్రోజులైనా స్పందించకపోవడంతో అనుమానించిన యాదయ్య ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ వెళ్లగా విషాద వార్త తెలిసింది. 

వ్యాపారంలో నష్టంతోనే చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌

జీవితంలో ఎదగాలంటే ఉద్యోగంపైనే ఆధారపడకుండా ఏదైనా వ్యాపారం చేయాలని ప్రదీప్‌కుమార్‌ భావించాడు. అప్పులు చేసి తెలియని ఏదో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. నష్టాలు రావడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడి కుటుంబసభ్యులతో కలిసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడే మందు మృతుడు ప్రదీప్‌కుమార్‌ తన డైరీలో రాసిన సూసైడ్‌ నోట్‌ తండ్రిని ఉద్ధేశించి ‘నాన్న మీకు నేను రాసే చివరి సందేశం ఇదే అనుకుంటా.. మీకు ఏదేదో చెప్పాలనుకున్న.. చెప్పలేక పోతున్న.. నన్ను క్షమించు నాన్న.. నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ మంచి చెడులు చూసుకోవల్సిన నేనే మిమ్మల్ని వదిలి వెళిపోతున్నాను. లైఫ్‌లో ఏదో చేయాలని, జాబ్‌పై డిపెండ్‌ అవ్వొద్దనే ఉద్ధేశంతో.. నాకంటూ ఓ కంపెనీ ఉండాలనే ఆలోచన. డబ్బులు సంపాదించి నాకున్న హోమ్‌ లోన్‌ అయిపోగొట్టాలి అనే ఆలోచనలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా. పర్సనల్‌ లోన్‌ తీసుకుని హోమ్‌లోను ఎల్‌ఐసీకి మార్చి.. రూ. 22 లక్షలు తీసుకుని చాలా చాలా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న. తిరిగి చూస్తే అప్పు తప్ప ఏం కనిపించలేదు. ఒకడు నా ఇంటికి వచ్చి నిలదేసే దాక ఎదురు చూడలేను. అలాగే ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్నా. ఇది నాకు అమ్మ ఉంచిపోయిన జ్ఞాపకంగా భావిస్తాను. ఇంతగా అప్పులు అయిన విషయం స్వాతికి కూడ తెలియదు. ఎవరికి చెప్పాలో అర్థం కాదు.. ఎలా తీర్చాలో దారి దొరకడం లేదు’ అంటూ రాశాడు. చనిపోయే ముం దు గోడకు ఉన్న తల్లి ఫొటోను తన పక్కన సోఫాలో ఉంచి చనిపోవడం కుటుంబీకులను కలిచివేసింది. 

ఆస్తులు ఉన్నాయి.. అప్పు తీర్చే మార్గం ఉన్నా ... 

ప్రదీప్‌కుమార్‌ తన సూసైడ్‌ నోట్‌లో రాసిన విధంగా ఆయనకు రూ. 22 లక్షల అప్పు ఉంది. ప్రదీప్‌కుమార్‌కు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో నెలకు రూ. 70 వేల జీతంతో పాటు ఇంటి అద్దెలు రూ. 20 వేల వరకు వస్తుంటాయి. ప్రదీప్‌కుమార్‌ అప్పులు తీర్చలేనంత భీదరికంలో లేడు. హస్తినాపురం, సంతోషిమాతా కాలనీలో ఉండే ఇల్లు విలువ సుమారు రూ. 2 కోట్ల మేర ఉంటుంది. అదేకాకుండా పక్కనే ఉండే వెంకటేశ్వరకాలనీలో ప్రదీప్‌కుమార్‌కు 200 గజాల స్థలం ఉంది. ప్రదీప్‌కుమార్‌ తండ్రికి ఊర్లో 10 ఎకరాల వ్యవసాయభూమితో పాటు పార్టనర్‌ షిప్‌లో రైస్‌మిల్లు ఉన్నట్లు బంధువులు తెలిపారు. అవసరం అనుకుంటే లక్షలు ఇచ్చే ఆప్తులు ఉన్నారు. అప్పు తెచ్చి వ్యాపారంలో పెట్టి  రూ.22లక్షలు నష్టపోయినట్లు సూసైడ్‌ నోట్‌ రాసి భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తాగి చావడంపై బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రులు విస్మయం వ్యక్తం చేశారు. 


logo