శుక్రవారం 29 మే 2020
Suryapet - Mar 02, 2020 , 01:06:50

అదే ఉత్సాహం...

అదే ఉత్సాహం...

నల్లగొండ, నమస్తేతెలంగాణ : పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని మున్సిపాల్టీల్లో మౌలిక వసతు లు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 24నుంచి చేపట్టిన పట్టణ ప్రగతి ఆది నుంచి అదే ఉత్సాహం తో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు, యువకులు పాల్గొంటున్న నేపథ్యం లో ప్రగతి కార్యక్రమం ఉరకలు వేస్తుంది. ఈనెల 4వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో ఆదివారం ఆ యా ప్రాంతాల్లో ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా కేంద్రం లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు పట్టణ ప్రగతిలో పాల్గొనగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, హాలియా మున్సిపాల్టీలో స్థానిక అధికారు లు, ప్రజాప్రతినిధులతో భాగస్వామ్యమై అధికారులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. చిట్యాల మున్సిపాల్టీలో ము న్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి, కమిషనర్‌ ఐత ప్రభాకర్‌ పాల్గొనగా దేవరకొండలో మున్సిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌ పట్టణ ప్రగతిలో భాగస్వామ్యమయ్యారు.  

 బక్కతాయికుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేస్తాం  : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నల్లగొండరూరల్‌ : పట్టణ పరిధిలోని 34వ వార్డులో గల బక్కతాయి కుంటను మిని ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా అదివారం పట్టణంలోని 34వ వార్డులో పర్యటించి, ఆ ప్రాంత ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని సత్వర పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. మేజర్‌ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. వార్డులో ఉన్న పార్కు అభివృద్ధి కోసం నిధులు గతంలోనే పెట్టడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇండ్లపై నుంచి వెళ్లే హైటెన్షన్‌ వైర్లను కూడా తీసి వేసేందుకు ఎస్టిమేషన్‌ వేయాలన్నారు. లతీఫ్‌ సాబ్‌ గుట్ట నుంచే వరదను అరికట్టడం కోసం పూర్తిగా  స్టామ్‌ వాటర్‌ డ్రైనేజీ నిర్మాణం చేసి వరద కాల్వను బక్కాతాయి కుంటలోకి మళ్లించాలన్నారు. దీని కోసం ఇప్పటీకే వీటి నిర్మాణాల కోసం ఐదు కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, కమిషనర్‌ దేవ్‌సింగ్‌, వార్డు కౌన్సిలర్‌ రావిరాల పూజిత, మాజీ కౌన్సిలర్‌ రావుల శ్రీనివాస్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, అంజిరెడ్డి, షణ్ముక, సీతారాంరెడ్డి, కృష్ణయ్య, పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి

l    ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 

 తిరుమలగిరి(సాగర్‌) : నూతనంగా ఏర్పడిన హాలియా పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. ఆదివారం హాలియా మున్సిపాల్టీలోని 11వ వార్డులో ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని హాలియా, నందికొండను మున్సిపాల్టీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని తెలిపారు. పట్టణంలో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం హాలియా పట్టణంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి స్టోర్‌, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు రుచికరమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యనందిచాలని అన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వెంపటి పార్వతమ్మశంకరయ్య, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వేమన్‌రెడ్డి, కౌన్సిలర్‌ వర్రా వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లుయాదవ్‌, నాయకులు వడ్డె సతీశ్‌రెడ్డి, సురభి రాంబాబు, శ్రీను పాల్గొన్నారు.

 ప్రజల సమస్యలు పరిష్కరించాలి

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధికారులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని హనుమాన్‌పేట కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని కాలనీలోని పలు వీధుల్లో పర్యటించి ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలకశాఖ మంత్రి పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారని ఈ నిధులతో పట్టణంలోని 48వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

 ఏ వార్డులో అయినా కాలనీల్లో అయినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాల్సి ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కుర్ర విష్ణు, కౌన్సిలర్‌ ఇలియాస్‌, కమిషనర్‌ చీమ వెంకన్న, డీఈలు శ్రీనివాస్‌, సాయివాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు మాజీద్‌, సిద్దగాని యాదయ్యగౌడ్‌ పాల్గొన్నారు.


logo