బుధవారం 03 జూన్ 2020
Suryapet - Mar 02, 2020 , 01:01:14

నేడు గోవర్ధనగిరి అలంకారంలో యాదాద్రీశుడు

నేడు గోవర్ధనగిరి అలంకారంలో యాదాద్రీశుడు

‘రాజీవ నేత్రుడికి రతనాల లాలి...  మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి..

జగమేలు స్వామికి పగడాల లాలి..   కల్యాణ రామునికి కౌసల్య లాలి.. 

యధువంశ విభునికి యశోద లాలి..  కరిరాజా ముఖునికి గిరితనయ లాలి..

పరమాంశ భవునికి పరమాత్మ లాలి..’  అంటూ సన్నాయి మేళాల మధ్య  

ఆలయ విద్వాంసులు స్వామివారిని కీర్తిస్తుంటే..  భక్తులు నారసింహుడి సేవలో స్మరించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం యాదాద్రీశుడు.. వటపత్రశయనుడి అలంకరణలో కనువిందు చేశాడు.

కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ తరించాడు.. స్వామివారి అలంకార ప్రాశస్థ్యాన్ని ఆస్థానాచార్యులు

రాఘవాచార్యులు వివరించగా.. భక్తులు భక్తిశ్రద్ధలో విన్నారు.


యాగశాలలో హోమం

ఆలయ యాగశాలలో ప్రత్యేక హోమం నిర్వహించారు. అర్చక బృందం ప్రత్యేక పూజలు చేసింది. యాగశాలలో కొనసాగుతున్న హోమాది పూజల్లో పాల్గొన్న రుత్వికులు స్తోత్ర పఠనం నిర్వహించారు. నిరంతర పారాయణ పఠనంతో యాదాద్రి కొండపై బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది.


విష్ణుసహస్ర పారాయణాలు

 సుప్రభాతవేళ యాదాద్రిలో శ్రీవైష్ణవ విష్ణుసహస్రపారాయణాలు భక్తులను అలరించాయి.  శ్రీవైష్ణవులు స్వామిని స్తుతిస్తూ నిర్వహించిన ప్రభాతభేరితో కొండపై కోలాహలం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం యజ్ఞశాలలో హవనం నిర్వహించారు. సామవేదం, వేదమంత్రపఠనం, మూలమంత్ర జపాలు, శ్రీమద్రామాయణం, శతకపారాయణాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఏఈవో దోర్బల భాస్కర్‌, పర్యవేక్షకులు గజ్వేల్‌ రమేశ్‌బాబు, గజ్వేల్‌ రఘు, డి.సురేందర్‌రెడ్డి, వేముల వెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రావు, అలంకార నిపుణులు ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు.


నయనానందకరం.. వటపత్ర దర్శనం

యాదాద్రి తిరువీధుల్లో శ్రీలక్ష్మీనరసింహుడు నయనానందకరంగా వటపత్రశాయి అలంకార రూపంలో దర్శనమివ్వగా..భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బాలాలయంలో స్వామివారు పల్లకీ సేవలో తరిస్తుండగా భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ కొబ్బరికాయలు సమర్పించుకున్నారు. 


పొన్నవాహనంపై..

నారసింహుడు.. వటపత్రశాయి అలంకరణలో పొన్న వాహనంపై ఊరేగుతూ  రాత్రి వేళ యాదాద్రి కొండపై భక్తులకు దర్శనమిచ్చాడు.  శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఉత్సవమూర్తిగా భక్తులను కనువిందు చేశాడు.  మానవాళికి సర్వశుభాలు కలగాలని కోరుతూ ఈ వేడుకను యాదాద్రిలో ఘనంగా నిర్వహించారు. 


ఉచిత వైద్య శిబిరం 

 యాదాద్రిలో మల్టీస్పెషాలిటి వైద్య శిబిరంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అపోలో దవాఖాన వైద్యులు రాంబాబు, శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ముక్కు, గొంతు, వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు, స్థానికులకు వైద్య సేవలు అందించారు.


logo