మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 02, 2020 , 00:59:29

పోషకాల పంటలపై దృష్టి సారించాలి

పోషకాల పంటలపై దృష్టి సారించాలి

నీలగిరి : పోషక విలువలుకలిగిన ఆహార పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం సమీపంలోని రైతు ఉద్యానవన పంటల వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ప్రతి మనిషికి రోజు 100 గ్రాముల దుంపలు, 100 గ్రాముల ఆకుకూరలు, 100 గ్రాముల కూరగాయలు, 150 గ్రాముల పండ్లు, 30 గ్రాముల మటన్‌ అవసరమన్నారు. రాష్ర్టానికి 41లక్షల టన్నుల కూరగాయలు అవసరం ఉండగా, కేవలం 30లక్షల టన్నులు మాత్రమే పండిస్తున్నారని తెలిపారు. మిగతా 11లక్షల టన్నుల కూరగాయలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అయితే దిగుమతి చేసుకునే సమయం లో పోషక విలువలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. అందుకే మనకు అవసరమైన కూరగాయలను ఇక్కడే సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. 90వేల హెక్టార్లలో టమాట సాగు చేస్తుండగా 7లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వస్తుందని, ప్రస్తుతం టమాట ధర బాగా పడిపోయిందని, దాన్ని ఆరబెట్టి భద్రపరుచుకుంటే భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేగాకుండా టమాట జ్యూస్‌ తాగితే పోషకాలు అందుతాయన్నారు. 1960లో 2శాతం ఉద్యానవన పంటలు సాగవుతుండగా ప్రస్తుతం 16 శాతం పెరిగిందని, దాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పొలం గట్లపై టేకు, శ్రీగంధం, మల్బరి చెట్లు పెంచితే మంచి ఆదాయం వస్తుందని వివరించారు. ఈ ఏడాది మల్బరీ 60 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బత్తాయి సాగు పెద్ద ఎత్తున ఉన్నప్పటికి రాష్ట్ర ప్రజలు కేవలం ఒక్క శాతానికి మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపారు. అనంతరం ఉద్యాన వ్యవసాయ క్షేత్రాలను ఆయన సందర్శించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి. సంగీతలక్ష్మి, డీడీహెచ్‌ విజయ్‌ప్రసాద్‌, విశ్రాంత డీడీఏ నర్సింగ్‌దాసు, ఏడీ జగన్‌మోహన్‌రెడ్డి, ఉద్యానవన  అధికారులు యానాల శ్యాంసుందర్‌రెడ్డి, చిన్నపురెడ్డి అనంతరెడ్డి, రావుల విద్యాసాగర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. 


logo