బుధవారం 03 జూన్ 2020
Suryapet - Mar 02, 2020 , 00:51:55

ఫ్లోరోసిస్‌పై కాన్పూర్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ అధ్యయనం

ఫ్లోరోసిస్‌పై కాన్పూర్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ అధ్యయనం

మర్రిగూడ : ప్రతి ఇంటికి మంచి నీటిని అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ఫ్లోరైడ్‌ బాధితులకు వరంలా ఉపయోగపడిందని ఒడిశా రాష్ర్టానికి చెందిన కాన్పూర్‌ ఐఐఐటీ రీసెర్చ్‌ స్కాలర్‌ అశ్వినికుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని అజిలాపురం, తిరుగండ్లపల్లి, మర్రిగూడ, భట్లపల్లి గ్రామాల్లోని వ్యవసాయ బోరుపంపులు, చేతి పంపులు నుంచి వస్తున్న నీటిలోని ఫ్లోరైడ్‌ తీవ్రతను ప్రత్యేక పరికరం ద్వారా పరిశీలించారు. ఇక్కడి గ్రామాల్లోని ప్రజలు ఫ్లోరోసిస్‌ మహమ్మారితో పోరాటం చేయడం బాధాకరమని, ప్రభుత్వం భగీరథ ద్వారా మంచి నీళ్లను అందించడం హర్షనీయమన్నారు. సాగు నీరు కూడా అందినట్లయితే తినే ఆహారం కూడా ఫ్లోరైడ్‌ రహితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నీటి నమూనాలను సేకరించి కాన్పూర్‌ ప్రయోగశాలకు తరలించనున్నట్లుగా పేర్కొన్నారు. భూగర్భజలాల నుంచే ఫ్లోరైడ్‌ విరుగుడుకు సంబంధించిన పరిశోధనలు జరిపేందుకే నమూనాలు సేకరించినట్లు తెలిపారు. అనంతరం జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఫ్లోరైడ్‌ బాధితుల కష్టాలను నేరుగా చూసి సీఏం కేసీఆర్‌ చలించిపోయారన్నారు. తాగు, సాగు జలాలతోనే ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని గ్రహించిన  సీఎం కేసీఆర్‌ శివన్నగూడెం రిజర్వాయర్‌కు రూపకల్పన నిర్మాణ పనులు చేపట్టారన్నారు. అనంతరం ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుకట్ల సుభాష్‌ మాట్లాడుతూ రైతాంగం భూగర్భ జలాలతో వ్యవసాయం చేస్తున్నందున పంటల్లో కూడా ఫ్లోరైడ్‌ సమస్య ఉంటుందన్నారు. ప్రాజెక్టుల పూర్తయితేనే భవిష్యత్‌లో ఫ్లోరైడ్‌ సమస్య రాకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఐఎన్‌ఆర్‌ఈఎం సంస్థ ప్రతినిధులు లింగంపల్లి కళ్యాణ్‌, యలజాల శివ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దంటు జగదీశ్వర్‌, ఉపాధ్యక్షుడు పందుల పాండుగౌడ్‌, మాజీ ఎంపీటీసీ మారగోని రామన్న, సత్తిరెడ్డి, గాంధీ పాల్గొన్నారు.    


logo