శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 01, 2020 , 02:20:17

అనుభవానికే అవకాశం

అనుభవానికే అవకాశం

నల్లగొండ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ : నల్లగొం డ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా డీసీసీ బీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా ము గిసింది. డైరెక్టర్‌ స్థానాలన్నీ ఏకపక్షంగా గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులే నాలుగు పదవులకు ఎన్నికయ్యారు. డీసీసీబీ చైర్మన్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా సుదీర్ఘకాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. డీసీసీబీ వైస్‌ చైర్మన్‌గా నల్లగొం డ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. దయాకర్‌రెడ్డి గతం లో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా, కొద్ది రోజులు చైర్మన్‌గా కూ డా బాధ్యతలు నిర్వహించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన ఆయన ప్రధాన అనుచరుడు సూర్యాపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్య యాదవ్‌ ఎన్నికయ్యారు. గతంలో ఉప సర్పంచ్‌, సర్పంచ్‌, ఎంపీపీగా పని చేసిన అనుభవం జానయ్య యాదవ్‌ సొంతం. మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల పీఏసీఎస్‌ చైర్మన్‌గా సుదీర్ఘ అనుభవం కలిగిన దుర్గంపూడి నారాయణరెడ్డి డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల ఇన్‌చార్జిగా విచ్చేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన పేర్లను వెల్లడించడంతో డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. 


ఒక్కొక్క నామినేషన్‌, ఏకగ్రీవంగా ఎన్నిక...

నల్లగొండలోని డీసీసీబీ కార్యాలయంలో శనివారం ఉదయం 9నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి రెండు సెట్లు దాఖలు చేశారు. తొలిసెట్‌లో మహేందర్‌రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్‌ పల్లా ప్రవీణ్‌రెడ్డి ప్రతిపాదించారు. గుడిపాటి సైదులు బలపరిచారు. మరో సెట్‌లో కోడి సుష్మ ప్రపోజ్‌ చేయగా.. అందెల లింగం యాదవ్‌ బలపరిచారు. వైస్‌ ప్రెసిడెంట్‌ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి సైతం రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేయగా.. విరిగినేని అంజయ్య, ధనావత్‌ జయరాం వేర్వేరు సెట్లలో మహేందర్‌రెడ్డిని ప్రతిపాదించారు. కొండా సైదయ్య, కందరబోయిన వీరా స్వామి బలపరిచారు. రెండు పదవులకూ ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో 11గంటల తర్వాత ఎన్నిక ఏకగ్రీవమైనట్లు జిల్లా సహకార ఎన్నికల అధికారి శ్రీనివాసమూర్తి ప్రకటించారు. మరోవైపు డీసీఎంఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌గా వట్టె జానయ్య యాదవ్‌ ఒకే సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. డైరెక్టర్లు అయిన కర్నాటి లింగయ్య ప్రతిపాదించగా.. ధనావత్‌ జయరాం బలపరిచారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి పేరును నెల్లూరి ఉషా రాణి ప్రపోజ్‌ చేశారు. అప్పల శోభన్‌బాబు బలపరిచారు. ఇక్కడ కూడా రెండు పదవులకూ ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో.. ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎస్వీ ప్రసాద్‌ ప్రకటించారు. 


టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సంబురాలు, 

నేతల అభినందనలు..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు డీసీసీబీ, డీసీఎంఎస్‌ కార్యాలయాల ఎదుట సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. ఎన్నిక ఏకగ్రీవమైన అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు కార్యాలయాల నుంచి పక్కనే ఉన్న ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి శేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌ కుమార్‌, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్‌ రవీందర్‌ కుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి తదితరులు వారిని అభినందించారు. కార్యకర్తలు గజమాలతో చైర్మన్లను సన్మానించారు. 


logo