ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 01, 2020 , 02:12:58

రైతు సంక్షేమమే ధ్యేయం..

రైతు సంక్షేమమే ధ్యేయం..

నా తల్లిదండ్రులు వట్టె బాలయ్య, అవిలమ్మ. నేను రెండో సంతానం.  మాది నిరుపేద కుటుంబం కావడంతో ప్రాథమిక విద్య గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, పదో తరగతి దాకా సూర్యాపేట పట్టణంలోని రాజాబహుద్దుర్‌ వెంకట్రామిరెడ్డి పాఠశాలలో చదివాను. ఇంటర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, డిగ్రీ ఎస్‌వీ కళాశాలలో పూర్తి చేశా. ఇటీవలే హైదరాబాద్‌ గాంధీ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ లా కూడా పూర్తయ్యింది. 1998లో తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన రేణుకతో వివాహమైంది. మాకు ఇద్దరు కుమారులు. ఆది నుంచి వ్యాపారమైనా, రాజకీయమైనా ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావివ్వకుండా ముందుకు సాగుతూ, ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటున్నాం. పేదరికం నుంచి వ్యాపారం చేస్తూ ఎంతో సంపాదించినా రాజకీయాల్లోనూ విలువలకు కట్టుబడి ఉన్నాం. 20 ఏండ్లుగా ప్రజల్లోనే ఉంటూ ప్రజల అభిమానాన్ని వారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో మా సతీమణి రేణుక కౌన్సిలర్‌గా, నేను పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా.  


2001లో ఓటుహక్కు.. ఉపసర్పంచ్‌ పదవి..

రాజకీయ నేపథ్యం లేకున్నా మొక్కవోని ధైర్యంతో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ ఇటు రాజకీయంగా, అటు వ్యాపారంలో నిలదొక్కుకున్నాను. ఓటు హక్కు వచ్చిన 2001 సంవత్సరంలోనే టీఆర్‌ఎస్‌ మద్దతుతో వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్‌ పదవి దక్కించుకున్నా. నాటి నుంచి నేటి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రతి ఎన్నికల్లో ప్రజల అభిమానం పొందుతున్నాం. నా గ్రామానికే కాకుండా మండల ప్రజలకు సైతం ఉత్తమ సేవలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాం. ఎన్నిసార్లు గెలిచినా, ఎంత మంది ఎమ్మెల్యేలను చూసినా మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎవరూ సాటి లేరు. 2001నుంచి ఆయనే స్ఫూర్తిగా ప్రజాసేవలో రాజకీయంగా ఎదుగుతున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన వెంటనే మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సార్‌తో పాటు నేను కూడా గులాబీ జెండా పట్టుకున్నాం. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాం. నాపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి, సహకరించిన టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లతో పాటు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు. నా పదవీ కాలం మొత్తం రైతులకు సేవలు అందిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తా. మంత్రి జగదీష్‌రెడ్డి సలహాలు, సూచనలతో పాటు అందరి సహకారం తీసుకుంటూ నా వంతు కృషి చేస్తా. ధన్యవాదాలు. 


logo