గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 29, 2020 , 01:22:07

అధ్యక్షులు ఎవరో..?

అధ్యక్షులు ఎవరో..?


అధ్యక్షులు ఎవరో..?నల్లగొండ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ :  డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నేడు జరుగనుంది. ఎన్నిక నిర్వహణ కోసం ఈ నెల 22న నోటిఫికేషన్‌ విడుదల కాగా.. నేటి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 12 గంటల వరకు స్క్రూట్నీ నిర్వహిస్తారు. 12 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఒకవేళ ఏదైనా పదవికి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలై.. పోటీ నెలకొంటే మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. అయితే.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవుల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఒక్కరే ఉన్నందున.. నాలుగు పదవులూ టీఆర్‌ఎస్‌ పక్షాన ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. 


చైర్మన్‌లు ఎవరన్నదే ఉత్కంఠ 

జిల్లాలో సహకార ఎన్నికల్లో పీఏసీఎస్‌ డైరెక్టర్లు మొదలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లతోపాటు డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకపక్ష విజయం సాధించారు. పీఏసీఎస్‌ డైరెక్టర్ల విషయంలో ఒకటి రెండు చోట్ల తప్ప కాంగ్రెస్‌ ఎక్కడా టీఆర్‌ఎస్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు మొత్తం ఒక్కటి మినహా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. దీంతో నేడు డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తోపాటు.. డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఆయా డైరెక్టర్ల నుంచే ఎన్నుకోనున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల సూచనలు, సలహాల మేరకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆయా పదవులకు టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా అవకాశం ఎవరికి లభిస్తుందో అనే ఉత్కంఠ ఇటు డైరెక్టర్లతోపాటు అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. నేడు నామినేషన్ల స్వీకరణ సమయం వరకు ఆయా పదవులకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎవరిని ఎంపిక చేసిందనే అంశంపై స్పష్టత రానుంది.  logo