శుక్రవారం 29 మే 2020
Suryapet - Feb 28, 2020 , 02:42:13

ఉద్యమంలా ‘పట్టణ ప్రగతి’ కొనసాగాలి

ఉద్యమంలా ‘పట్టణ ప్రగతి’ కొనసాగాలి

సూర్యాపేట టౌన్‌ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆరేళ్లుగా కోట్లాది రూపాయలతో నిరంతరం అన్నిరంగాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని.. సీఎం కేసీఆర్‌ దేశంలోనే మరెక్కడా లేని విధంగా వినూ త్న పథకాలతో యావత్‌ దేశం తెలంగాణ అభివృద్ధి వైపు చూసేలా చేశారని.. అందులో భాగంగానే ప్రతిష్టాత్మంగా చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి ఉద్యమంలా కొనసాగిస్తూ మరింత ముందుకు సాగుతూ సూర్యాపేటను రాష్ట్రంలో నెంబర్‌వన్‌ జిల్లాగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం నాలుగో రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 33వ వార్డును ఆయన అకస్మికంగా తనికీ చేశారు. మంత్రి వార్డులో కాలినడకన ఇంటింటికీ కలియతిరిగి చిన్నా, పెద్దా తేడాలేకుండా వృద్ధులను సైతం పలకరిస్తూ సమస్యలను అడిగితెలుకున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సత్వరమే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.  మూ డ్రోజులుగా జరిగిన పని, ప్రస్తుతం జరుగుతున్న పని.. ఇంకా జరుగబో యే పని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు నిరంతరం కొనసాగించాలన్నారు. పట్టణ ప్రగతిలో పర్యావరణానికి ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఇంటిలో ఖాళీ స్థలం లేనివారు మిద్దేలపై కుండీల్లో, వృథా వస్తువులలో ఇంటిపంటను పెంచుకుని పర్యావరణ పరిరక్షణతో పాటు రసాయనిక ఎరువులు లేని కురగాయలు, పండ్లు, ఆకు కూరలను పండించి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించాలన్నారు. 75 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేవారు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌ క్రిష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, కౌన్సిలర్‌ కొండపల్లి భద్రమ్మ, నంద్యాల భిక్షంరెడ్డి, కమిషనర్‌ రామానుజుల్‌ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo