శుక్రవారం 29 మే 2020
Suryapet - Feb 27, 2020 , 02:11:36

నారసింహుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

నారసింహుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్వస్తివచనంతో ఘనంగా  ప్రారంభమయ్యాయి.  బాలాలయంలో నిత్య పూజల అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10: 55 గంటలకు విష్వక్సేనారాధన, స్వస్తివచనం, రక్షాబంధనం కార్యక్రమాలు  ప్రధానార్చకుల పర్యవేక్షణలోఅర్చక బృందం అత్యంత వైభవంగా నిర్వహించింది. తొలిపూజలకు ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తదితరలు హాజరయ్యారు. లక్ష్మీనరసింహుడు విశ్వశాంతి, లోక కల్యాణం కోసం అమ్మవారిని వివాహమాడే ఘట్టానికి రక్షాబంధనంతో ఉత్సవ దీక్ష మొదలైంది. అర్చకులు స్వామి, అమ్మవారి విగ్రహాలను ఆలయ ముఖమండపంలో అధిష్ఠించి నాందివాచకంగా విష్వక్సేనుడిని ఆరాధిస్తూ పూజలు చేశారు. ఘనంగా హోమం నిర్వహించారు.

సంప్రోక్షణతో  ఆలయశుద్ధి

పూజా జలంతో ఆలయ పరిసరాలను అర్చకులు శుద్ధి చేశారు. పంచామృత కలశాలకు వేదమంత్రాలతో  పూజలు నిర్వహించి పుణ్యజలంగా సంప్రోక్షణ చేశారు. తిరువీధుల్లో వేదసూక్త మంత్రపఠనంతో తీర్థ ప్రోక్షణ చేశారు. దేశకాల పాత్ర, పవిత్రతను, స్థల ద్రవ్యపవిత్రత, ఆలయ పరిసర ప్రాంతాల పవిత్రతను పెంపొందించేందుకు ఈ వేడుకను ఉత్సవ ప్రారంభ సూచకంగా జరిపారు. అనంతరం  రుత్విగ్వరణం నిర్వహించారు. 

ఘనంగా అభిషేకం...

పాంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో ఉత్సవ నిర్వహణ నిర్విఘ్నంగా సాగడానికి ఉదయం అభిషేకం నిర్వహించారు.  అనంతరం మంగళవాయిద్యాల మధ్య కొండంతా శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ ప్రారంభ ప్రాధాన్యతతో చతుర్వేదాలు, ఉపనిషత్తులు, పంచసూక్తములు, రామాయణ, చతుర్భాగవతాలను, క్షేత్ర మహాత్యాన్ని, సుదర్శనశతక, సుందరాకాండ, మూలమంత్ర జపాలను రుత్వీకులు, వేదపండితులు, ఆలయ అర్చకులు నిర్వహించారు.

విష్వక్సేనారాధన..

 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో  విష్వక్సేనారాధన శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్ర్తానుసారంగా నిర్వహించారు. వేడుకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఐశ్వర్యం, దివ్య తేజస్సును ప్రసాదించాలని కోరుత విష్వక్సేనుడిని ఆరాధించారు.

రక్షాబంధనం

ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్షను తీసుకోవడమే రక్షాబంధనం. మొదట దేవస్థానం అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో గీత, ఆలయ ప్రధాన అర్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు రక్షాబంధనం చేశారు. అనంతరం మంత్రపుష్పం, శాంతిమంత్రాలు నిర్వహించారు.

దీక్షావస్ర్తాల సమర్పణ

యాదాద్రీశుడి సన్నిధికి ఉత్సవాల నిర్వహణ కోసం వచ్చిన రుత్వీకులు, వేదపండితులకు  దీక్షా వస్ర్తాలను అందజేశారు. అదేవిధంగా ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, యాజ్ఞీకులు శేషం ప్రణీతాచార్యులకకు ఆలయ ఈవో ఎన్‌. గీత దీక్షావస్ర్తాలు అందజేశారు. 

 అంకురారోపణం..

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణం అత్యంత వైభవంగా నిర్వహించారు.  పుట్ట వద్ద మంత్రోచ్ఛారణలతో భూదేవిని ప్రార్థించి మృత్సగ్రహణం నిర్వహించారు. 

ఉచిత వైద్య శిబిరం

హైద్రాబాద్‌ అమీర్‌పేట ఎంఎస్‌ కంటి దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 250 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, ఏఈవోలు మేడి శివకుమార్‌, దోర్బల భాస్కరశర్మ, వేముల రామ్మోహన్‌, పర్యవేక్షకులు గజవెల్లి రమేశ్‌బాబు,  రఘు, వేముల వెంకటేశ్‌,  శ్రావణ్‌కుమార్‌తదితరులు పాల్గొన్నారు.

 పోచంపల్లి పట్టువస్ర్తాలు..

భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహుడి కల్యాణం కోసం పోచంపల్లిలో తయారు చేసిన పట్టు వస్ర్తాలను యాదాద్రి ఈవో గీతకు అందజేశారు. పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘంతో పాటు దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నేయించిన పట్టు వస్ర్తాలను బుధవారం యాదాద్రి క్షేత్రానికి తీసుకువచ్చారు. తొలుత భూదాన్‌పోచంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌ తదితరులు స్థానిక మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


logo