శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 26, 2020 , 00:30:49

‘పల్లె ప్రగతి’ నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

‘పల్లె ప్రగతి’ నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

మర్రిగూడ : పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో చేపట్టాల్సిన  పనులపై అధికారులు, సర్పంచులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ శానావజ్‌ ఖాసీం హెచ్చరించారు. మంగళవారం మండలంలోని తమ్మడపల్లి, యరుగండ్లపల్లి గ్రామాల్లో పల్లెప్రగతిలో చేపడుతున్న పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. తమ్మడపల్లి గ్రామంలో ప్రాథమిక, అంగన్వాడీ పాఠశాలలు, యరుగండ్లపల్లిలో అంగన్వాడీ, జడ్పీ పాఠశాలలు, నర్సరీ, శ్మశానవాటికలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ్మడపల్లి ప్రాథమిక పాఠశాల పాత భవనాన్ని కూల్చివేయాలని డీఈఓ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. యరుగండ్లపల్లి జడ్పీపాఠశాల ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. యరుగండ్లపల్లి నర్సరీ నిర్వహణ, హరితహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కువగా పిచ్చిమొక్కలు, మురుగు ఉండడంతో అధికారులపై సీరియస్‌ అయ్యారు. మరోసారి తప్పకుండా ఇదే గ్రామానికి వస్తానని అప్పటివరకు శానిటేషన్‌లో మార్పురావాలని హెచ్చరించారు. ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు ప్రతి ఇంటికి నిర్మించుకునేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌లు కార్యదర్శులదేనని తెలిపారు. పాఠశాలలు, శ్మశానవాటికలు, రోడ్లకిరువైపులా హరితహారం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మున్సిపల్‌శాఖ మంత్రి భార్యలకు భర్తలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవద్దని చెపుతున్నప్పటికీ అధికారులు మాత్రం సర్పంచ్‌ల భర్తలనే ప్రోత్సహిస్తున్నారు. డీఐజీ తనిఖీ సమయంలో మహిళా సర్పంచులు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుకుమార్‌, ఏపీఓ రాంచందర్‌నాయక్‌, ఈసీ వివేక్‌, కార్యదర్శులు శిరీశ, పద్మ పాల్గొన్నారు.


logo