గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 26, 2020 , 00:26:54

ఏకగ్రీవం

ఏకగ్రీవం

సహకార సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా సత్తా చాటిన తెలంగాణ రాష్ట్ర సమితి.. సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా మార్కెటింగ్‌ సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించింది. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియను.. నల్లగొండలో నిర్వహించగా అన్ని స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. డీసీసీబీలో మొత్తం 20స్థానాలు ఉండగా.. ఏ బ్లాక్‌లో 16, బీ బ్లాక్‌లో నాలుగు స్థానాలున్నాయి. డీసీసీబీ ‘ఏ’ బ్లాక్‌లో 10జనరల్‌ స్థానాలకు 18మంది నామినేషన్లు వేయగా.. వారిలో 8మంది విత్‌ డ్రా చేసుకున్నారు. బీసీ కోటాలో 2స్థానాలకు 5నామినేషన్లు దాఖలు చేయగా.. ముగ్గురు ఉపసంహరించుకున్నారు. ఒక్కో ఎస్సీ, ఎస్టీ స్థానాలకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. ఏ బ్లాక్‌లో మరో ఎస్సీ, ఎస్టీ స్థానాలకు అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. డీసీసీబీ ‘బీ’ బ్లాక్‌లో నాలుగు స్థానాలు ఉండగా.. ఒక్క జనరల్‌ స్థానానికి రెండు నామినేషన్లు వేసినా ఒకరు ఉప సంహరించుకున్నారు. బీసీ స్థానానికి నాలుగు నామినేషన్లు దాఖలైనా ముగ్గురు విత్‌ డ్రా చేసుకున్నారు. ఎస్సీ స్థానానికి ఒకే ఒక్క నామినేషన దాఖలైంది. ఎస్టీ స్థానానికి అభ్యర్థులు లేక నామినేషన్‌ దాఖలు కాలేదు. డీసీసీఎంఎస్‌లో మొత్తం 10డైరెక్టర్లకు ఏ బ్లాక్‌లో ఆరు, బీ బ్లాక్‌లో నాలుగు స్థానాలున్నాయి. ‘ఏ’ బ్లాక్‌లో ఎస్సీ, ఎస్టీ స్థానాలకు ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యాయి. బీసీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు వేసినా.. ముగ్గురు ఉపసంహరించుకున్నారు. జనరల్‌ కోటాలో మూడు స్థానాలకు 8మంది నామినేషన్లు దాఖలు కాగా.. ఐదుగురు విత్‌ డ్రా కావడంతో ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవమైంది. డీసీఎంఎస్‌ బీ బ్లాక్‌లో నాలుగు డైరెక్టర్‌ స్థానాలకు నలుగురే సభ్యులు ఉండటంతో నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల అభ్యర్థుల పక్షాన నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్‌, నల్లమోతు భాస్కర్‌రావు హాజరయ్యారు. డీసీసీబీ, డీసీసీబీ డైరెక్టర్ల నామినేషన్ల ఉప సంహరణ సమయంలో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి.. డీసీసీబీ పక్కనే ఉన్న ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌజ్‌లో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఏ ఒక్క స్థానానికీ ఎన్నిక జరిగే పరిస్థితి రాకుండా అన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం చేయడంలో రాజకీయ చాతుర్యత ప్రదర్శించి ఫలితం సాధించారు. ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామని జిల్లా సహకార ఎన్నికల అధికారి శ్రీనివాసమూర్తి ప్రకటించారు. 

l ఏకగ్రీవాలతో గులాబీ నేతల సంబురాలు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నిక సందర్భంగా ఒకే ఒక్క నామినేషన్‌ చొప్పున ఆయా డైరెక్టర్ల స్థానాలకు దాఖలు కావడంతోపాటు అవన్ని ఏకగ్రీవమై అందులో టీఆర్‌ఎస్‌ సభ్యులే ఎక్కువగా ఉండడంతో ఆపార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేసి సంబురాలు  చేసుకున్నారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల నర్సింహయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్యయాదవ్‌, గాదరి కిశోర్‌ కుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo