గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Feb 24, 2020 , 02:48:05

డిగ్రీ ప్రవేశాల్లో యాజమాన్య కోటా

డిగ్రీ ప్రవేశాల్లో యాజమాన్య కోటా

నల్లగొండ విద్యావిభాగం : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ)ద్వారా చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు మొత్తం దోస్త్‌ ద్వారానే భర్తీ అవుతుండడంతో పలు సందర్భాల్లో ప్రైవేటు యాజమాన్యాలు పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మాదరిగి డిగ్రీలోనూ మేనేజిమెంట్‌ కోటాను అందుబాటులోకి తేవాలని  చేసిన విజ్ఞప్తికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ విషయమై గత రెండేళ్లుగా జరుగుతున్న చర్చోపచర్చల అనంతరం ఉన్నత విద్యా మండలి నిర్ణయాన్ని వెల్లడించింది. 2020-21విద్యా సంవత్సరం నుంచే అమలుకు పచ్చజెండా ఊపడంతో యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 92ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో కొన్ని గ్రామీణ, మండల, జిల్లా ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడంతో యాజమాన్యాలు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. ఇదే కారణంతో ఇప్పటికే పలు కళాశాలలు మూతపడ్డాయి. తాజాగా మేనేజిమెంట్‌ కోటా అందుబాటులోకి రావడం వల్ల 30శాతం సీట్లు భర్తీ చేసుకునే అవకాశం దక్కడంతో ఆశలు చిగురిస్తున్నాయి. 


ఉమ్మడిజిల్లాలో 2019-20లో 96 కళాశాలలు..

ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2019-20లో 96 డిగ్రీ కళాశాలలు ఎంజీయూ నుంచి అనుమతి పొందాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 42, సూర్యాపేట జిల్లాలో 34, యాదాద్రి భువనగిరి జిల్లాలో 22 కళాశాలలు ఉన్నాయి. అయితే వీటిలో అన్ని కోర్సులలో 31,225 అడ్మిషన్లు ఉండగా దోస్త్‌ ద్వారా 13,675 అడ్మిషన్లు భర్తీ అయ్యాయి. వీరిలో ప్రథమ సెమిస్టర్‌ 11,221మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష పీజులు చెల్లించినట్లు సమాచారం. 


logo